ఆ 45 టీఎంసీలూ మావే!
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:19 AM
పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి గోదావరి జలాలను మళ్లిస్తే ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను వాడుకోవాలి. వీటిలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 45 టీఎంసీలు తనకే రావాలని తెలంగాణ పట్టుబడుతోంది.
తెలంగాణకు ఇవ్వక్కర్లేదు..
బ్రిజేశ్ ట్రైబ్యునల్ ముందు ఏపీ స్పష్టీకరణ
అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి గోదావరి జలాలను మళ్లిస్తే ఎగువ రాష్ట్రాలు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను వాడుకోవాలి. వీటిలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 45 టీఎంసీలు తనకే రావాలని తెలంగాణ పట్టుబడుతోంది. అయితే ఆ రాష్ట్రానికి వాటితో సంబంధం లేదని.. ఆ నీరంతా తమదేనని ఆంధ్రప్రదేశ్ మరోసారి స్పష్టంచేసింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా సారథ్యంలోని న్యాయవాద బృందం ఢిల్లీలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు శుక్రవారం తన వాదనలు కొనసాగించింది. ‘గోదావరి జల వివాద ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం.. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తే.. 80 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీ 45 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలు, కర్ణాటక 21 టీఎంసీలు వినియోగించుకోవాలి. మూడు రాష్ట్రాలు ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నాయి. దానిప్రకారం 35 టీఎంసీల కృష్ణా జలాలను ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర వాడుకుంటున్నాయి. మిగిలిన 45 టీఎంసీలు మాకే దక్కుతాయి. ఆ నీటిని నాగార్జున సాగర్‌కు ఎగువన వాడుకోవాలని రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఆ నీటిని మేం కరువు ప్రాంతం రాయలసీమలో వినియోగించుకుంటాం. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న రాజధాని అమరావతి నగర తాగునీటి అవసరాల కోసం 12.60 టీఎంసీలను వినియోగించుకుంటాం. 2023 అక్టోబరు 6న ఇచ్చిన తుది విధి విధానాల మేరకు తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తుంది’ అని ఉద్ఘాటించారు. కాగా.. బ్రిజేశ్ ట్రైబ్యునల్ విచారణ శుక్రవారం ముగిసింది. వచ్చే నెల 12 నుంచి 14వ తేదీ వరకు వాదనలు కొనసాగుతాయి.