మరణించిన ఓటర్లు 15 లక్షల మంది!
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:38 AM
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు.
వివరాల సేకరణకు వీలుకాని ఫారాల పెరుగుదల
ముంచుకొస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల గడువు
ఎల్లుండిలోగా సమర్పించకపోతే ఓటు గల్లంతే
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వీటిలో ఓటర్ల వివరాల సేకరణకు వీలుకాని (అన్‌కలెక్టబుల్) ఫారాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. మంగళవారం నాటికి వీటి సంఖ్య 44,05,933 (10.58శాతం)కు చేరింది. గత నాలుగైదు రోజుల్లోనే ఇవి ఏకంగా 43,546 పెరిగాయి. గతంలో మరణించిన ఓటర్ల సంఖ్య 14,87,008 ఉండగా, తాజాగా ఆ సంఖ్య 15,00,831 (3.61శాతం)కి చేరింది. ఇక అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ ఫారాలు 8,08,426 (1.94శాతం) ఉన్నాయి. వీటిలో గతంలో కన్నా స్వల్ప తగ్గుదల కనిపింది. శాశ్వతంగా చిరునామా మారిన ఫారాల సంఖ్య 13,89,564 (3.34శాతం) ఉండగా, ఇంతకుముందు కంటే ఈ ఫారాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మరోవైపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ గడువు ఈ నెల 24తో పూర్తికానుంది. అప్పటిలోగా బీఎల్‌వోలకు ఫారాలు తిరిగి ఇవ్వవచ్చు. లేకుంటే ఈ నెల 21న ఎన్నికల సంఘం ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు ఉండే అవకాశం కోల్పోతారు.