Share News

ఇక 4 రోజులే..‘సర్‌’!

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:21 AM

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వచ్చి ఇచ్చిన..

ఇక 4 రోజులే..‘సర్‌’!

  • ఫారం ఇవ్వకపోతే ఓటు గల్లంతే

  • 14తో ఎన్యూమరేషన్‌ ఫారాల

  • సమర్పణకు గడువు పూర్తి

  • 99.87శాతం మేరకు ఫారాల పంపిణీ

  • ఓటర్లకు ఇంకా ఇవ్వాల్సినవి 54,501

  • 81.07 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వచ్చి ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫారాలను ఈ నెల 14నాటికి పూర్తిచేసి తిరిగి వారికే సమర్పించాలి. ఓటర్ల జాబితాలో ఓటు పదిలంగా ఉండాలంటే ఈ ప్రక్రియ అత్యవసరం. లేదంటే ఈ నెల 21న ఎన్నికల సంఘం ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతుకానుంది. ఒకవేళ ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్‌వోల నుంచి అందకపోతే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఆన్‌లైన్‌లో కూడా ఎన్యూమరేషన్‌ ఫాంను సమర్పించే అవకాశం ఉంది. లేదా సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి కూడా ఫారాలు పొందే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు చేపట్టిన ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. అంటే మరో 4 రోజులే మిగిలి ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 4,15,73193 మందికి ఎన్యురేషన్‌లను పంపిణీ చేశారు. దీంతో ఫారాల పంపిణీ 99.87ు పూర్తయింది. మరో 54,501 ఫారాలు పంపిణీ చేయాల్సి ఉంది. పంపిణీ చేసిన ఫారాలలో ఇప్పటి వరకు 3,37,49,131 ఫారాలను డిజిటలైజ్‌ చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన బులెటెన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. 81.07 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ అయ్యాయని పేర్కొన్నారు. ఇదిలావుంటే, ఎన్నికల సంఘం 99.87 శాతం మేరకు ఫారాల పంపిణీ పూర్తయిందని చెబుతున్నా తమకు ఈ ఫారాలు అందలేదని పలు చోట్ల ఓటర్లు వాపోతున్నారు. ఇక, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 04:22 AM