Share News

ఇలాగైతే కష్టమే ‘సర్‌’

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:13 AM

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది.

ఇలాగైతే కష్టమే ‘సర్‌’

  • దగ్గరపడుతున్న ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల గడువు

  • ఇప్పటి వరకు 98.65 శాతం పంపిణీ

  • వాటిలో 37.66 శాతమే డిజిటలైజేషన్‌ పూర్తి

  • 12 రోజుల్లో మిగతావి పూర్తి చేయగలరా?

  • అదనపు పనులతో తీవ్ర ఒత్తిడిలో బీఎల్వోలు

  • తమకు సర్‌ విధులు వద్దంటున్న అంగన్వాడీలు

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. దీంతో అటు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్వోలు), ఇటు రాజకీయ వర్గాల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ సగం కూడా పూర్తి కాకపోవడంతో బీఎల్వోలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ‘సర్‌’ ప్రక్రియను ఎన్నికల సంఘం నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ గడువులోనే బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేపట్టి 4.16 కోట్ల ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి, పూర్తి చేసిన ఫారాలు తిరిగి సేకరించి వాటిని డిజిటలైజ్‌ చేయాలి. ఆ డిజిటలైజ్‌ ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగడానికి బీఎల్‌వోలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంత తీవ్ర ఒత్తిడిలో కింద స్థాయి సిబ్బంది పని చేస్తుండడంతో స్వచ్ఛ ఓటర్ల జాబితా తయారయ్యేనా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా సమగ్రంగా రూపొందించడం చాలా కష్టమని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. సర్‌ గడువును పెంచాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలు వినతులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి చేరాయి. గడువును పొడిగిస్తేనే బీఎల్వోలు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పనిచేస్తారని, దాంతో తప్పులు దొర్లకుండా ఉండే అవకాశం ఉటుందని పలువురు భావిస్తున్నారు.


సమయం సరిపోతుందా?

రాష్ట్రంలో సర్‌ కార్యక్రమం జూన్‌ 15వ తేదీన ప్రారంభమైంది. గురువారానికి 17 రోజులు గడిచాయి. ఇప్పటివరకు ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను ఓటర్లకు పంపిణీ చేయడం అయితే దాదాపు పూర్తయింది. గడువు తేదీ అయిన 14కు అంటే మరో 12 రోజుల్లో బీఎల్వోలు మిగిలిన అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు సేకరించాలి, వాటిని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అంటే డిజిటలైజ్‌ చేయాలి. ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను ఓటర్లకు అందించడానికే 17 రోజులు పట్టినప్పుడు వాటన్నింటినీ సేకరించి డిజిటలైజ్‌ చేయడానికి మిగిలిన ఈ 12 రోజులు సరిపోతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల డిజిటలైజేషన్‌ బీఎల్వోలు చాలా జాగ్రత్తగా చేయాలి. వివరాలన్నీ తప్పుల్లేకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. సర్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.16 కోట్ల మందికి ఓటర్‌ ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు పంపిణీ చేయాల్సి ఉండగా, గురువారం నాటికి 4.10 కోట్ల ఫామ్‌ల పంపిణీ పూర్తయినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,56,76,423 ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను మాత్రమే డిజిటలైజ్‌ చేశారు. ఇంకా 62 శాతం డిజిటలైజ్‌ కావాల్సి ఉంది.


బీఎల్వోలకు అదనపు పని భారం

సర్‌ ప్రక్రియలో బీఎల్వోలకు క్షేత్రస్థాయిలో అగ్నిపరీక్షే ఎదురవుతోంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో సుమారు వెయ్యికిపైగా ఓటర్లున్నారు. ఎన్యూమరేషన్‌ పక్రియలో భాగంగా సంబంధిత ఓట్ల వివరాలు 2002 ఓటర్ల జాబితా ప్రకారం పరిశీలించుకోవాలి. ఒక వేళ 2002 ఓటర్ల జాబితాలో ఓటు లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన 12 రకాల డాక్యుమెంట్లతో ఏదో ఒకటి ఇవ్వాలి. ఇక్కడే అసలు ఇబ్బందులు వస్తున్నాయి. 2002 ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో, తమ బంధువుల ఓట్లు ఉన్నాయో లేవో ఎలా చెక్‌ చేసుకోవాలో చాలా మందికి తెలియడం లేదు. ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను ఎలా పూర్తి చేయాలో కూడా తెలియడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అరకొరగా, లేదా తప్పులతడకగా ఫామ్‌లు పూర్తి చేసి బీఎల్వోలకు అప్పగించేస్తున్నారు. కొంత మంది ఓటర్లు అయితే ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను మళ్లీ బీఎల్వోలు వచ్చి తీసుకెళ్లే వరకు పూర్తి చేయడంలేదు. దీంతో ఆ పని కూడా బీఎల్వోలపై పడింది. బీఎల్వోలకు ఈ అదనపు పని భారంతో ఓటర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఉన్నతాధికారులు పెట్టే రోజు వారీ టార్గెట్లను చేరుకోలేక ఇబ్బందిపడుతున్నారు. ఇంకా 12 రోజుల్లో 3 కోట్లకుపైగా ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయం పడుతోందని బీఎల్‌వోలు వాపోతున్నారు. ఒక్కో ఫామ్‌ డిజిటలైజేషన్‌కు 10 నిమిషాలకుపైగా పడుతోందని చెబుతున్నారు. పని ఒత్తిడితో తప్పులు దొర్లే అవకాశం ఉందని అంటున్నారు. సర్‌ గడువు పొడిగించాలని వారు కూడా కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు అందజేయడం, తీసుకోవడం కొంత వరకు ఇబ్బందులు లేకుండా జరుగుతోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇంట్లో ఉండే వారు ఇళ్లు మారుతుంటారు. ఇలాంటి సమయంలో ఓటర్ల ఇంటికి పదే పదే బీఎల్వోలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


సచివాలయ సిబ్బందికి పలు పనులు

రాష్ట్రంలో బీఎల్వో విధులను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. కేవలం బీఎల్వో విధులనే కాకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను కూడా వారు చేయాల్సి ఉంది. సర్‌ కార్యక్రమాలతో పాటు సర్వేలు చేయాల్సి రావడం, రెండు అంశాలు ప్రధానమైనవే కావడంతో బీఎల్వోలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటింటి సర్వే గడువును ఎన్నికల సంఘం మరికొన్ని రోజులు పొడిగించాలని వారు కోరుకుంటున్నారు. మరోవైపు అంగన్వాడీలు కూడా తమను సర్‌ పనుల నుంచి మినహాయించాలని కోరుతున్నారు. గురువారం ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మలు కలిసి వినతిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో సర్‌ విధులు తమకే అప్పగిస్తున్నారని, తమకు బీఎల్వో విధుల నుంచి మినహాయించాలని కోరారు.

Updated Date - Jul 03 , 2026 | 04:14 AM