‘సర్’ అభ్యంతరాల పరిష్కారంపై దృష్టి
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:56 AM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారం, నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలను..
22, 23, 29, 30 తేదీల్లో పోలింగ్ బూత్‌లలో అందుబాటులో బీఎల్‌ఓలు
స్వీకరించిన పత్రాల అప్‌లోడ్ తప్పనిసరి
డీఈఓలతో సమీక్షలో సీఈఓ వివేక్
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్) ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారం, నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయడం దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం ఆయన, అదనపు సీఈవో ఢిల్లీరావుతో కలసి అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల(డీఈఓ)తో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ‘22, 23, 29, 30 తేదీలు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌వోలు), రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏలు) అందుబాటులో ఉంటారు. వివిధ ప్రక్రియల్లో ఓటర్లకు సహాయ సహకారాలను అందిస్తారు. వాటిని వేగవంతం చేస్తారు. క్లైయిములు, అభ్యంతరాల పరిష్కారంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు(ఈఆర్‌వోలు) క్వాజీ జుడీషియల్ అధికారాలను సరిగ్గా ఉపయోగించి, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. విచారణల సమయంలో ఓటర్లు సమర్పించే పత్రాలను బీఎల్‌వో యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. ఫారం-9, 10, 11, 11ఏలో నమోదైన క్లైయిములు, అభ్యంతరాల జాబితాలను రోజువారీగా సీఈవో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, వారానికోసారి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటర్ల నమోదును గరిష్ఠస్థాయికి తీసుకెళ్లాలి’ అని సీఈవో అన్నారు. అనంతరం అదనపు సీఈవో ఢిల్లీరావు మాట్లాడుతూ.. ‘ఓటర్లు ఇచ్చిన లేదా బీఎల్‌వోలు సేకరించిన పత్రాలను బీఎల్‌వో యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలి. ఆమేరకు జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏఈఆర్‌వోలకు గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను సక్రమంగా కేటాయించాలి. విచారణల సమయంలో అప్‌లోడ్ చేసిన పత్రాల ధృవీకరణకు జిల్లా ఎన్నికల అధికారులకు సమాంతర లాగిన్‌ను ఏర్పాటు చేశాం’ అని తెలిపారు.