ఓటర్ల జాబితాలో సవరణలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:07 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు.
22, 23, 29, 30 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలు
సెప్టెంబరు 28లోగా అన్నింటినీ పరిష్కరించాలి: సీఈఓ వివేక్ యాదవ్
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావుతో కలసి జిల్లా కలెక్టర్లతో(డీఈవో) సర్ పై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సర్ ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, క్లైయిముల పరిష్కార ప్రక్రియను, నోటీసులు జారీ, విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని ఓటర్లు, లోపాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, నోటీసులను పంపిణీ చేయడం, విచారణ పారదర్శకంగా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఓటర్ల జాబితాపై బీఎల్‌వోలకు వచ్చే ‘బుక్ ఏ కాల్’ పెండింగ్ అంశాలను, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ఓటరు వివరాల నమోదులో తప్పులున్న ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, విచారణ చేసి పరిష్కరించడం అత్యంత ముఖ్యమైన అంశం. సెప్టెంబరు 21లోగా అన్ని హియరింగ్ షెడ్యూల్స్ పూర్తి చేయాలి. సెప్టెంబరు 28లోగా పరిష్కరించాలి. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో 18-19 ఏళ్లు నిండిన యువ ఓటర్ల నమోదుకు అధికారులు జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి’ అని సీఈఓ ఆదేశించారు.