ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు 96.61శాతం పంపిణీ పూర్తి
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:41 AM
రాష్ట్రంలో ప్రతేక ఓటరు జాబితా సవరణ(సర్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు(సర్)సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్) 96.61 శాతం ఓటర్లకు..
23.05 శాతం డిజిటలైజేషన్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతేక ఓటరు జాబితా సవరణ(సర్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు(సర్)సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్) 96.61 శాతం ఓటర్లకు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా 23.05 శాతం ఫారాలు డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 25 నాటికి మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,02,15,339 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను(96.61శాతం) ఓటర్లకు పంపిణీ చేసినట్లు తెలిపారు. 95,95,180 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజేషన్ పూర్తయిందని తెలిపారు.
రెండు రోజుల్లోనే 8.28 శాతం ఫారాల డిజిటైజేషన్..
రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందని వివేక్ యాదవ్ తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు శని, ఆది వారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ చేపట్టారన్నారు. జూన్ 27, 28 తేదీల్లో బీఎల్‌వోలు సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయగా రెండు రోజుల్లోనే వరుసగా 4.63 శాతం నుంచి 8.28 శాతం మేర అప్‌లోడ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు జూలై 4, 5 తేదీల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాల స్థితి, సర్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈసీఐనెట్ యాప్‌లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఓటర్స్‌ఈసీఐ.జీవోవీ.ఇన్ పోర్టల్ ద్వారా ఓటరు నమోదు, వివరాల సవరణ తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియలో బీఎల్‌వోలకు సహకరించాలని కోరారు.