Share News

ఓటరన్నా.. జర జాగ్రత్త

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:06 AM

దేశవ్యాప్తంగా అలజడి సృష్టించి, ప్రతిపక్షాల ఆందోళనలకు, ప్రజల్లో అభద్రతా భావనకు కారణమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్‌) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది.

ఓటరన్నా.. జర జాగ్రత్త

  • అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే!

  • సర్‌ ప్రక్రియలో భాగంగా.. నేటి నుంచి బీఎల్‌వోల ఇంటింటి సర్వే

  • 4.16 కోట్ల ఓటర్ల ఎన్యూమరేషన్‌

  • జూలై 21న ముసాయిదా జాబితా

  • సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అలజడి సృష్టించి, ప్రతిపక్షాల ఆందోళనలకు, ప్రజల్లో అభద్రతా భావనకు కారణమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(సర్‌) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు(బీఎల్‌వోలు) సోమవారం నుంచి ఇంటింటి సర్వేకు రానున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్‌ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఇంతవరకే అయితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ, అర్హులైనవారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తేనే సమస్య వస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సర్‌పై అపోహలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఎంతో అప్రమత్తంగా, ఇంటింటి సర్వేలో ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను చేయాల్సిన ఉంది. ఓటర్లు కూడా తమ ఓటుహక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ.. బీఎల్‌వోలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది.

నేటి నుంచి బీఎల్‌వోల ఇంటింటి సర్వే

సర్‌ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, ఓటర్ల జాబితాలు, ఎన్యూమరేషన్‌ ఫారాల ముద్రణ పూర్తయింది. కీలక ఘట్టమైన బీఎల్‌వోల ఇంటింటి సర్వే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 2026 మే 12 నాటికి రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం 46,397 మంది బీఎల్‌వోలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితులయ్యే 68,868 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కూడా పాల్గొంటారు.


ఎన్యూమరేషన్‌ ఫారం నింపడమే కీలకం

ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు. ప్రతి ఓటరుకూ రెండు ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామాతోపాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి. పూర్తిచేసిన ఫారంలను బీఎల్వోలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్‌లో 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్‌ చేస్తున్నారు. 2002 జాబితాలోను, ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే... అందులోని మీ ఓటరు ఐడీ నంబరు, ఇతర వివరాలను ఫారంలో నింపాలి. అందులో మీ పేరు లేకుండా, ప్రస్తుత జాబితాలోనే ఉంటే మీ తల్లిదండ్రులు, భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఎవరి ఉంటే వారి వివరాలను ఫారంలో నమోదు చేయాలి. వీటితోపాటు మీ పుట్టిన తేదీ, తల్లి పేరు, భార్య, భర్త పేరు, వారి వివరాలు, ఎపిక్‌ నంబర్‌ నింపి, కొత్త కలర్‌ ఫొటో అతికించి బీఎల్‌వోకు ఇవ్వాలి. పూర్తి చేసిన ఫారంలను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. ఓటరు ఇంటివద్ద లేకుండా, వేరే ప్రాంతంలో ఉంటే, ఆ ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని కుటుంబసభ్యులు పూర్తిచేసి ఇవ్వొచ్చు. బీఎల్వోలకు ఫారం అందజేసిన వారి పేర్లు జూలై 21న ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉంటాయి. ఈ జాబితాపై జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకూ క్లైయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబరు 18 వరకు పరిష్కరిస్తారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోడానికి ఫారం 6, చిరునామాలో మార్పులకు ఫారం 8, మృతులు, అనర్హుల పేర్లు తొలగింపునకు ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని సెప్టెంబరు 18 వరకూ పరిశీలించి, సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.


ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్‌ ఫారం నింపొచ్చు

బీఎల్‌వోలు ఇచ్చే ఎన్యూమరేషన్‌ ఫారంను నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దానిలో వివరాలు పూర్తిచేసి ఆన్‌లైన్‌లోనే https://voters.eci.gov.inలో అప్‌లోడ్‌ చేయవచ్చు. లేదా బీఎల్‌వోకు ఇవ్వొచ్చు. ఈసీఐనెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అందులోనే ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తి చేసి సబ్‌మిట్‌ చేయవచ్చు.

రాజకీయ పార్టీలు అప్రమత్తం

సర్‌పై రాజకీయ పార్టీలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఎన్నికల సంఘం కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా, రాష్ట్రస్థాయిలో సమావేశాలు నిర్వహించింది. ప్రతి బూత్‌కు పార్టీలు తమ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించింది. బీఎల్‌వోలతోపాటు, బీఎల్‌ఏ(బూత్‌ లెవల్‌ ఏజెంటు)లు ఇంటిం టి సర్వేలో పాల్గొని సహకరించాలని కోరింది. అన్ని రాజకీయ పార్టీలు బీఎల్‌ఏల జాబితాను ఎన్నికల సంఘానికి అందించాయి. అయితే బీఎల్‌ఏల అప్రమత్తంగా వ్యవహరించేలా రాజకీయ పార్టీలు చూసుకోవాలి. బీఎల్‌వోలతో పాటు ఇంటింటి సర్వే సమయం లో తమ పార్టీల బీఎల్‌ఏలు వెళ్లేలా చూసుకోవాలి.

షెడ్యూల్‌ ఇలా...

రాష్ట్రంలో జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. జూలై 14న పోలింగ్‌ కేంద్రాలను రేషనలైజేషన్‌ చేస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఆరోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూలై 21 నుంచి సెప్టెంబరు 18 వరకు క్లెయిములు, అభ్యంతరాలు పరిష్కరిస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

Updated Date - Jun 15 , 2026 | 04:09 AM