Share News

ఓటరన్నా!.. ఓటు నిలుపుకో!

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:30 AM

రాష్ట్రంలో సర్‌(ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే) ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు చేపట్టిన ఇంటింటి సర్వే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాల

ఓటరన్నా!.. ఓటు నిలుపుకో!

  • ఇక మిగిలింది మూడు రోజులే!

  • 14తో ముగియనున్న ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణ

  • రాష్ట్రంలో 84 శాతం పూర్తి: వివేక్‌ యాదవ్‌

  • నింపిన 3.61 కోట్ల ఫారాల డిజిటలైజేషన్‌..ఇంకా చేయాల్సినవి 55 లక్షలు మాత్రమే

అమరావతి, వేమూరు, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సర్‌(ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే) ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు చేపట్టిన ఇంటింటి సర్వే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణకు ఇంకా మూడు రోజులే గడువ ఉంది. ఇప్పటికీ ఎన్యుమరేషన్‌ ఫారంను సమర్పించని ఓటర్లు వెంటనే బూత్‌ లెవల్‌ అధికారుల(బీఎల్‌వో)ను వెంటనే సంప్రదించి ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తి చేసి అందజేయాలి. లేదంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఎన్యుమరేషన్‌ ఫారాల సమర్పణకు ఈ నెల 14 తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. బీఎల్‌వో నుంచి ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారం అందకపోయినా ఓటరే స్వయంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, యాప్‌ల్లో ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తి చేసి సమర్పించవచ్చు. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, 4,16,00,167 మందికి ఎన్యురేషన్‌ ఫారాల(ఈఎఫ్)ను పంపిణీ చేశారు. అంటే ఈఎఫ్ల పంపిణీ 99.93 శాతం పూర్తయింది. వీరిలో చాలా మంది ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేశారు. వాటిలో 3,61,23,312 ఫారాలను(86.78 శాతం) డిజిటలైజ్‌ చేసినట్లు శనివారం విడుదల చేసిన బులెటెన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. మిగిలిన మూడు రోజుల్లో 55,04,382 ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. ఎన్యూమరేషన్‌ ఫారం నింపి బీఎల్‌వోకు సమర్పించిన వారి పేర్లు ఈనెల 21న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉంటాయి. ముసాయిదాజాబితాపై క్లైములు, అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు స్వీకరిస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటర్లజాబితాను విడుదల చేస్తారు.


ఒక్క ఓటరూ ఓటు మిస్‌ కాకుండా..

రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ 84 శాతం పూర్తయ్యిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం బాపట్ల జిల్లా వేమూరులో ఆయన పర్యటించారు. పలువురు ఓటర్లను పలుకరించారు. రెవెన్యూ అధికారులు, బీఎల్‌వోలతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఓటరు కూడా మిస్‌ కాకుండా సర్‌ ప్రక్రియను అన్ని విభాగాల వారు సంతృప్తిగా కొనసాగిస్తున్నారని చెప్పారు. 14వ తేదీకల్లా నూరుశాతం సర్వే పూర్తి చేసేందుకు చురుకుగా పని చేస్తున్నారన్నారు. గడువు పెంచే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ఆ నిర్ణయం తాను తీసుకునేది లేదని, కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆలోచన మేరకు జరుగుతుందని సమాధానమిచ్చారు. వేమూరు నియోజకవర్గలో సర్వేను 89 శాతం పూర్తి చేసినందుకు ఓటర్లకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గడువులోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌లోనూ సమర్పించొచ్చు..

బీఎల్‌వో ఇచ్చే ఎన్యుమరేషన్‌ ఫారాలే కాకుండా నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి కూడా ఫారం పొందొచ్చు. ఆ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు పూర్తి చేసి ఆన్‌లైన్‌లోనే https://voters.eci.gov.in లో సమర్పించవచ్చు లేదా బీఎల్‌వోకు ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈసీఐనెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోనూ ఆన్‌లైన్‌లోనే ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తి చేసి సబ్‌మిట్‌ చేయవచ్చు.

Updated Date - Jul 12 , 2026 | 05:32 AM