Share News

సర్‌ను మరో 10 రోజులు పొడిగించండి

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:35 AM

ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాల(ఈఎఫ్‌) స్వీకరణ, డిజిటలైజేషన్‌ గడువును 10 రోజులపాటు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వివేక్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు.

సర్‌ను మరో 10 రోజులు పొడిగించండి

  • ఎన్యూమరేషన్‌ గడువు పెంచాలని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేశాయి

  • ఈసీఐకి సీఈఓ వివేక్‌ యాదవ్‌ లేఖ

  • 39 లక్షల అన్‌కలెక్టబుల్‌ ఫారాలు

  • నేటితో ముగియనున్న ఓటర్ల ‘ఫారాల’ స్వీకరణ గడువు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాల(ఈఎఫ్‌) స్వీకరణ, డిజిటలైజేషన్‌ గడువును 10 రోజులపాటు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వివేక్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్యూమరేషన్‌ గడువు పొడిగించాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

4.16 కోట్ల ఫారాల పంపిణీ

ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఓటరు ఈఎఫ్‌ల సమర్పణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికీ ఫారంను పూర్తి చేసి వెనక్కి ఇవ్వని ఓటర్లు తక్షణమే తమ బీఎల్‌వోను సంప్రదించి ఈఎఫ్‌ను అందజేయాలి. లేకుంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు గల్లంతు అవుతుంది.

నేటితో ముగియనున్న ఫారాల స్వీకరణ

రాష్ట్రంలో సర్‌ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు చేపట్టిన ఇంటింటి ఓటరు ఈఎఫ్‌ల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్‌ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694మంది ఓటర్లు ఉండగా 4,16,26,144 మందికి ఈఎఫ్‌లను పంపిణీ చేశారు. వాటిలో 4,09,32,211 ఫారాలను... 98.32 శాతం డిజిటలైజ్‌ చేసినట్లు సీఈవో పేర్కొన్నారు.


39 లక్షల అన్‌కలెక్టబుల్‌ ఫారాలు...

రాష్ట్రంలో 4 కోట్ల 16 లక్షల 26 వేల 144 ఈఎఫ్‌ల పంపిణీ జరిగిందన్నారు. సోమవారాని కి డిజిటలైజ్‌ అయిన ఫారాల్లోనే అన్‌కలెక్టబుల్‌ ఫారాలు 39లక్షలు ఉన్నాయని(9.56శాతం), పెండింగ్‌లో 6,95,483 (1.67శాతం) ఉన్నాయని తెలిపారు. అన్‌కలెక్టబుల్‌ ఫారాల్లో 14,19,664 (3.41శాతం) మంది చనిపోయినట్లు గుర్తించామన్నారు. బీఎల్‌వోలు వెళ్లినా 7,26,425 మంది (1.75శాతం) ఓటర్లు దొరకలేదన్నారు. షిప్ట్‌ అయిన ఓటర్లు 12,14,994 (2.92శాతం) మంది ఉన్నారని, ఆల్‌రెడీ ఎన్‌రోల్డ్‌ 6,06,506 (1.46శాతం), ఇతరులు 13,830(0.03శాతం)... కలిపి 39,81,399 మందిని (9.56శాతం) అన్‌కలెక్టబుల్‌ జాబితాలో చేర్చినట్లు సీఈవో తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 04:37 AM