Share News

AP Health Department: అంధత్వ నివారణలో ఏపీ భేష్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:14 AM

పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అమలుచేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

AP Health Department: అంధత్వ నివారణలో ఏపీ భేష్‌

  • దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర విధానాలు

  • కేంద్ర ఆరోగ్యశాఖ తాజా నివేదికలో ప్రశంసలు

  • వార్షిక లక్ష్యం 90 వేల నుంచి 2.50 లక్షలకు పెంపు

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అమలుచేస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన తాజా నివేదికలో ప్రశంసించింది. ఏపీలో అనుసరిస్తున్న ఈ ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో కంటి అద్దాల పంపిణీకి సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రానికి కేటాయించిన వార్షిక లక్ష్యాన్ని 90 వేల నుంచి ఏకంగా 2.50 లక్షలకు పెంచింది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కళ్లద్దాలను ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ప్రతి ఏడాది జూలై నుంచి నవంబరు వరకు అన్ని పాఠశాలల్లోనూ కంటి పరీక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత కళ్లద్దాల సరఫరా సంస్థలను ఎంపిక చేసి.. ఫిబ్రవరిలోగా కళ్లజోళ్ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.


ఏటా రూ.3 కోట్లు ఖర్చు

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ప్రతి కళ్లజోడుకు గరిష్టంగా రూ.280 వరకు వ్యయం అవుతోంది. టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థలు సరఫరా చేసే కంటి అద్దాల నాణ్యతను లెన్సో మీటర్‌ ద్వారా పరీక్షిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించి, నాణ్యమైన అద్దాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అంధత్వ నివారణ కార్యక్రమ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ సంతృప్తికరంగా ఉంది. దీంతో 2026-27లో లక్ష్యాన్ని 2.50 లక్షల మందికి పెంచేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనివల్ల రూ.7.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో 90 వేల మంది లక్ష్యాన్ని అధిగమించి మొత్తం 1,89,102 మందికి అందించారు. 2025-26లోనూ 94,689 మందికి పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సంఖ్య రెండు లేదా మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

స్ఫూర్తిని కొనసాగిస్తాం: మంత్రి సత్యకుమార్‌

అంధత్వ నివారణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. దీని వెనుక అధికారుల కృషి ఉందని చెప్పారు. ఈ స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2026 | 04:14 AM