2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:45 AM
హర్‌ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో ఎంవోయూ
వర్చువల్‌గా పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
అమరావతి, న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): హర్‌ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం జల్‌జీవన్ మిషన్ 2.0పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జల్‌జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తాం. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించాం. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జల్‌జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు’ అని తెలిపారు. ముఖ్యంగా.. జల్‌జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు.
ఏపీ ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధిస్తుంది
జల్‌జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడారు. రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు జల్‌జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించి ‘వికసిత్ భారత్ 2047’కు తన వంతు సహకారం అందిస్తుందని పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలి
జల్‌జీవన్ మిషన్ మొదటి దశలో 16 కోట్ల గృహాలకు కుళాయిలు ఇచ్చామని పాటిల్ తెలిపారు. ‘మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగునీటిని అందించాల్సి ఉంది. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలి.’ అని సూచించారు. అంతకుముందు ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో జేజేఎం 2.0పై కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. అమరావతి నుంచి వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.