పరిధి దాటే పశువైద్యులపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:44 AM
పశువైద్యుల్లో కొందరు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, విధి నిర్వహణలో అత్యంత బాధ్యతరాహిత్యంగా ఉంటున్నారని ఏపీ పశు వైద్య మండలి బోర్డ్ చైర్మన్ పీవీ లక్ష్మయ్య మండిపడ్డారు.
పశు వైద్య మండలి చైర్మన్ లక్ష్మయ్య హెచ్చరిక
గుంటూరు మెడికల్, జూలై 16(ఆంధ్రజ్యోతి): పశువైద్యుల్లో కొందరు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, విధి నిర్వహణలో అత్యంత బాధ్యతరాహిత్యంగా ఉంటున్నారని ఏపీ పశు వైద్య మండలి బోర్డ్ చైర్మన్ పీవీ లక్ష్మయ్య మండిపడ్డారు. కొందరు పని చేసే కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారని, వీరు ఉద్యోగానికి ఏవిధంగా న్యాయం చేయగలరని ప్రశ్నించారు. పశు వైద్య సిబ్బందిలో 40 శాతం మంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పశువైద్యులు నెలలోపు తమ పద్దతి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వీరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని రాష్ట్ర పశు వైద్యశాల ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పశు వైద్యుల సంఘాలు తమ పరిధి దాటి ప్రభుత్వ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని లక్ష్మయ్య విమర్శించారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ నియామకంలో తమ మాట చెల్లుబడి కావాలని సంఘాల నేతలు పట్టుబట్టడం అనైతికం, అసంబద్ధమన్నారు. డైరెక్టర్ నియామకంపై సీఎం ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని, దీనిని ఎదిరించే హక్కు సంఘాలకు లేదన్నారు. కాగా, యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల్లో సుమారు రెండు వేల మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని లక్ష్మయ్య తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల పరిశీలన, ఏరివేతలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్ల ఏరివేతలో అభ్యర్థులకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.