ప్రకృతి సేద్య రైతులు సర్టిఫికేషన్ తీసుకోవాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:27 AM
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు.
లంకా దినకర్
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులంతా సర్టిఫికేషన్ తీసుకోవాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రకృతి సేద్య విస్తరణపై ఆయన సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు. 2035 నాటికి రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యం అయ్యేలా రైతు సాధికార సంస్థ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రకృతి సేద్యంపై ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,250కోట్లు, సేవా సంస్థలు రూ.310కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ సంస్థ రూ.100కోట్లు వెచ్చించాయన్నారు. రానున్న మూడేళ్లలో రూ.3800కోట్ల అంచనా వ్యయంతో 40లక్షల మంది రైతుల్ని భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2026-27లో ప్రకృతి సేద్యానికి రూ.321కోట్లకు ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే కేంద్రం రూ.100కోట్లు విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13,800 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రకృతి సేద్యం చేయడానికి ఈ నిధులు వినియోగించుకోవాలని కోరారు.