చంద్రబాబు విజన్‌తో మైనార్టీ యువతకు ఉజ్వల భవిత!
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:43 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాల ఆధునికీకరణకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు...
2.75 కోట్లతో ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ
రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలకు 216 కొత్త కంప్యూటర్లు
ఆధునిక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు.. లైబ్రరీలకూ మెరుగులు
ఏఐ, సైబర్‌నెట్‌వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సుల్లో శిక్షణ
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాల ఆధునికీకరణకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్లు, ఆధునిక సాఫ్ట్ వేర్ ఏర్పాటుతోపాటు, లైబ్రరీల ఆధునికీకరణ చేపట్టనుంది. ఇందుకోసం రూ.2.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసి ఉర్దూ అకాడమీకి జమ చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయా కేంద్రాల్లో కొత్త యూపీఎస్‌లు, లేజర్ జెట్ ప్రింటర్లు, స్కానర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రాల్లో యువతకు కొత్త కోర్సులు నేర్పించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా దేశ,విదేశాల్లో డిమాండ్ ఉన్న కృత్రిమమేధ(ఏఐ), సైబర్ నెట్‌వ ర్క్, క్లౌడ్ కంప్యూటింగ్, జావా, పైతాన్, గ్రాఫిక్ డిజైనింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నిరుద్యోగ యువతకు సాఫ్ట్‌వేర్ శిక్షణ..
సీఎం చంద్రబాబు విజన్‌తో మైనార్టీ యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తోందని మంత్రి ఫరూక్ తెలిపారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం, ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీల ఆధునికీకరణ యువత భవిష్యత్తును అత్యున్నత స్థాయిలో మార్చబోతున్నదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఉన్న 36 కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలను కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. 2014-19లో ఉర్దూ అకాడమీకి రూ.160 కోట్లను చంద్రబాబు విడుదల చేశార ని, ఆ నిధులతోనే శిక్షణ కేంద్రాలు అత్యాధునిక ల్యాబ్‌లుగా మారి వేలాదిమంది నిరుద్యోగ యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ శిక్షణను అందిపుచ్చుకున్న యువత ఎంతో మంది దేశవిదేశాల్లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019-24లో ఉర్దూ శిక్షణ కేంద్రాలను, లైబ్రరీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బడ్జెట్ విడుదల చేయకపోవడంతో వైసీపీ పాలనలో శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయని, మౌలిక వసతులు దెబ్బతిని, మైనార్టీ యువత కలలు కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడిందన్నారు. ఉర్దూ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసిన సీఎంకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు.