పట్టణాలకు కొత్త రూపు
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:41 AM
రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రూ.7,469.46 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద పట్టణాల్లో..
రూ.7,469 కోట్లతో మౌలిక వసతుల కల్పన
హెచ్‌ఏఎం విధానంలో పనులకు ప్రభుత్వం అనుమతి
మూలధన వ్యయం 5,500 కోట్లు, వడ్డీ 1,969.46 కోట్లు
రహదారులు, డ్రెయిన్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి
123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.40,743 కోట్ల ప్రాజెక్టులు
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని పురపాలక, నగర పాలక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రూ.7,469.46 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద పట్టణాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, డ్రెయిన్లు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.5,500 కోట్లు మూలధన వ్యయం కాగా వడ్డీ రూ.1,969.46 కోట్లు. మంత్రివర్గ ఆమోదం, ఆర్థికశాఖ అనుమతి అనంతరం ఈ మేరకు మున్సిపల్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న విస్తృత పట్టణ మౌలిక వసతుల కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ పథకాలు, నిధుల ద్వారా సుమారు రూ.40,743 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొన్ని మంజూరు కాగా, కొన్ని అమల్లో ఉన్నాయి. మరికొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయి.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన, నివాసయోగ్యమైన, పెట్టుబడులకు అనుకూలమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు గ్యాప్ అసెస్‌మెంట్ రిపోర్టులు, మౌలిక వసతుల పెట్టుబడుల ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో 2029 వరకు అవసరాలు, పూడ్చాల్సిన లోటును గుర్తించారు. నీటి శుద్ధి సామర్థ్యంలో 724 ఎంఎల్‌డీ, నీటి పంపిణీ నెట్‌వర్క్‌లో 9,608 కి.మీ., మురుగునీటి శుద్ధి సామర్థ్యంలో 1,443 ఎంఎల్‌డీ, భూగర్భ డ్రైనేజీ నెట్‌వర్క్‌లో రూ.19,081 కి.మీ., పట్టణ రహదారుల్లో 4,388కి.మీ. లోటు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోటును అమృత్, ఏఐఐబీ, యూఐడీఎఫ్, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఎస్‌బీఎం, ఎన్‌ఆర్‌సీపీ, పట్టణాభివృద్ధి సంస్థల నిధులతో పూడ్చేందుకు ప్రాజెక్టులను అనుసంధానిస్తున్నారు. 75 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా 1,083 ఎంఎల్‌డీ సామర్థ్యం, 7,148 కి.మీ. నీటి పంపిణీ నెట్‌వర్క్, 8.74 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు, అదనంగా 1,263 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం అందుబాటులోకి వస్తున్నాయి.
రూ.4,655 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు
అనుమతించిన రూ.5,500 కోట్ల పెట్టుబడుల్లో రహదారులు, డ్రెయిన్లకు రూ.4,655 కోట్లు, పార్కులకు రూ.509కోట్లు, వీధి దీపాలకు రూ.247 కోట్లు, సెంట్రల్ మీడియన్లకు రూ.87కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో గుర్తించిన పట్టణ రహదారి నెట్‌వర్క్ మొత్తం 25,626 కి.మీ. కాగా, ఇప్పటికే 21,238 కి.మీ... అంటే 82.9 శాతం అభివృద్ధి చేశారు. మిగిలిన 4,388 కి.మీ. హెచ్‌ఏఎం ద్వారా చేపట్టనున్నారు. అలాగే 541 పార్కులు, 20,340 వీధిదీపాల పాయింట్లు, 1,186 కి.మీ. సెంట్రల్ మీడియన్లకు డీపీఆర్‌లు సిద్ధం చేశారు. మొత్తం మూలధన వ్యయంలో రూ.2,200 కోట్లు (40శాతం) ఎల్‌ఆర్‌ఎస్/ బీపీఎస్ నిధుల నుంచి డీటీసీపీ ద్వారా ముందస్తుగా సమకూర్చనున్నారు. మిగిలిన రూ.3,300 కోట్లు (60శాతం) కన్సెషనర్ సమకూరుస్తారు. ఈ మొత్తాన్ని పదేళ్లలో 40 త్రైమాసిక వాయిదాల్లో తిరిగి చెల్లిస్తారు. దీనికోసం ఎల్‌ఆర్‌ఎస్/ బీపీఎస్ రాబడులు, అభివృద్ధి ఆమోద ఫీజులు, ఎంఐజీ/ ఎల్‌ఐజీ లేఅవుట్ ఆదాయాలు తదితరాలను ఎస్ర్కో ఖాతా ద్వారా వినియోగించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు ఆపరేషన్, నిర్వహణ బాధ్యతను కన్సెషనర్ నిర్వహించనున్నారు.
పచ్చదనానికి ప్రాధాన్యం
గత రెండేళ్లలో చేపట్టిన పట్టణ హరిత కార్యక్రమాలకు హెచ్‌ఏఎం ప్రాజెక్టు మరింత ఊతమివ్వనుంది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 58 కొత్త పార్కుల ఏర్పాటు, 110 పాత పార్కుల ఆధునికీకరణ, 45 పార్కుల నిర్మాణంలో 530 కి.మీ. అవెన్యూ అభివృద్ధి, 135 కి.మీ. సెంట్రల్ మీడియన్ అభివృద్ధి చేపట్టారు. హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా 2,165 కి.మీ. పట్టణ రహదారుల వెంట సుమారు 4.43 లక్షల మొక్కలు నాటారు. పట్టణ స్థానిక సంస్థల రహదారుల్లో దాదాపు 90 శాతం మేర గ్రీన్ కవరేజీని మ్యాపింగ్ చేశారు. హెచ్‌ఏఎం డీపీఆర్‌లో చేర్చిన 541 పార్కులు స్థానిక స్థాయిలో వినోదం, పచ్చదనం, వసతులను మరింత బలోపేతం చేయనున్నాయి. పట్టణ ఘన వ్యర్థాలు, మురుగునీటి శాస్త్రీయ నిర్వహణను కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, కంపోస్టింగ్ యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీల ద్వారా 57 శాతం ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తున్నారు. 108 సమీకృత ఘనవ్యర్థాల నిర్వహణ ఫెసిలిటీలకు వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. వీటి మొత్తం ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు రూ.5,385 టన్నులు. 2026 జూలైలో 8 ప్లాంట్లు ప్రారంభించగా, వచ్చే అక్టోబరు నాటికి మరో 66 ప్లాంట్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరులో నాలుగు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు పీపీపీ విధానంలో అమల్లో ఉన్నాయి. విజయవాడ, తిరుపతిలోని ప్రాజెక్టులు టెండర్ దశలో ఉన్నాయి. మరో ఆరు కంప్రెసెడ్ బయోగ్యాస్ ప్లాంట్లకు వర్క్‌ఆర్డర్ జారీ కాగా, వీటిని వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.