యూనివర్సిటీ పోస్టుల నోటిఫికేషన్లు ఉపసంహరణ
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:15 AM
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైసీపీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో నిర్ణయానికి ఉన్నత విద్యాశాఖ ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైసీపీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. గత ప్రభుత్వంలో రోస్టర్ విధానాన్ని అస్తవ్యస్తం చేసి.. నోటిఫికేషన్లు జారీచేయడంతో అనేక న్యాయ వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు యూనివర్సిటీల్లో పోస్టులను కొత్త నోటిఫికేషన్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీంతో 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉపసంహరణకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా, 2023లో 18 యూనివర్సిటీల్లో 3295 పోస్టుల భర్తీకి వర్సిటీలు నోటిఫికేషన్లు జారీచేయగా, న్యాయ వివాదాల కారణంగా దరఖాస్తుల స్వీకరణ సమయంలోనే హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ ఆగిపోయింది.