Share News

అడ్డగోలు నిబంధనలతో ‘అనర్హత’!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:14 AM

యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా అభ్యర్థుల్లో అనర్హుల సంఖ్య భారీగా పెరిగింది. యూజీసీ పేస్కేలు ఉండాలనే నిబంధన..

అడ్డగోలు నిబంధనలతో ‘అనర్హత’!

  • యూనివర్సిటీ పోస్టుల దరఖాస్తుల్లో అనర్హులుగా వేలాది మంది అభ్యర్థులు

  • ‘యూజీసీ పేస్కేలు’ రూల్‌ కారణం

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ పోస్టుల భర్తీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టులకు విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా అభ్యర్థుల్లో అనర్హుల సంఖ్య భారీగా పెరిగింది. యూజీసీ పేస్కేలు ఉండాలనే నిబంధన అనర్హులను భారీగా పెంచింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని యూనివర్సిటీల్లో కలిపి 10,671 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 960 మంది (9.35 శాతం) మాత్రమే అర్హులుగా తేలారు. ఇక ప్రొఫెసర్‌ పోస్టులకు 1679 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో కేవలం 167 మంది (10.34 శాతం) అర్హులయ్యారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూజీసీ పేస్కేలుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండటంతో పాటు అన్ని సంవత్సరాల బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఐటీఐఆర్‌లు సమర్పించాలనే నిబంధన పెట్టడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు అర్హత కోల్పోయారు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఐటీఐఆర్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు లేకపోయినా యూనివర్సిటీ ధ్రువీకరణతో దరఖాస్తులు తీసుకున్నాయి. కాగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 1,65,336 దరఖాస్తులు రాగా, 1,39,162 మంది (89.11 శాతం)ని అర్హులుగా గుర్తించారు. లెక్చరర్‌ పోస్టులకు 8005 మంది దరఖాస్తు చేసుకోగా 7214 (92.99 శాతం) మంది అర్హులుగా తేలారు.


సబ్జెక్టులో మార్పులతో తంటా

గతంలో బేసిక్‌ పీజీ సంబంధిత సబ్జెక్టులో చదివి ఉండి.. పీహెచ్‌డీ అనుబంధ, సమానమైన సబ్జెక్టుల్లో చేసినా పోస్టులకు అనుమతించారు. కానీ ఈసారి రెండూ ఒకేలా ఉంటేనే అర్హులుగా గుర్తించారు. ఉదాహరణకు ఎం.కామ్‌(కామర్స్‌) చదివి, మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసి ఉంటే... అలాంటి వారిని ఇప్పటి వరకూ అటు మేనేజ్‌మెంట్‌, ఇటు కామర్స్‌ రెండు పోస్టులకూ అర్హులుగా గుర్తించారు. కానీ ఇప్పుడు వారిని కేవలం మేనేజ్‌మెంట్‌కే పరిమితం చేశారు. అదే కామర్స్‌ పీహెచ్‌డీ చేసిన వారిని మాత్రం రెండు పోస్టులకు అర్హులుగా గుర్తించారు. దీంతో చాలా మంది అర్హత కోల్పోయారు.

కాంట్రాక్టు సిబ్బందికీ నష్టం

యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారూ ఈ నోటిఫికేషన్లలో నష్టపోయారు. వారిని సాంకేతికంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా చూపడం లేదు. దీంతో యూజీసీ పేస్కేలు వారికి అందదు. ఫలితంగా అనర్హులుగా మారారు. పదేళ్లకు పైగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తమను ఇలా అనర్హులు చేయడం ఎంతవరకు న్యాయమని కాంట్రాక్టు బోధనా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 05:16 AM