వర్సిటీ పోస్టులపై ముందుకే
ABN , Publish Date - May 12 , 2026 | 05:46 AM
యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల నియామకాల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగాలనే నిర్ణయించింది. రేషనలైజేషన్, రోస్టర్, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ అంశాలపై గతంలో నమోదైన...
కేసులపై విచారణ వాయిదా.. నేడు జీవోలు!
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల నియామకాల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగాలనే నిర్ణయించింది. రేషనలైజేషన్, రోస్టర్, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ అంశాలపై గతంలో నమోదైన కేసులపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులను న్యాయస్థానం వేసవి సెలవుల తర్వాత మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఆలస్యం అవుతాయేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే న్యాయస్థానం కొత్త నోటిఫికేషన్ల జారీని నిలిపివేయాలని చెప్పనందున ఉన్నత విద్యాశాఖ ముందుకే సాగాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం అన్ని వర్సిటీల వీసీలు, రిజిస్ర్టార్‌లతో ఉన్నతాధికారులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. వర్సిటీల్లో ఖాళీల వివరాలు పంపాలని ఆదేశించారు. మంగళవారం ఆ పోస్టులతో ఉన్నత విద్యాశాఖ జీవోలు జారీ చేయనుంది. 15న వర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేస్తాయి.
కాంట్రాక్టు సిబ్బందికి 5శాతం వెయిటేజీ
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఏపీపీఎస్సీ నిర్వహించే స్ర్కీనింగ్ పరీక్షలో ఏడాదికి 0.5 శాతం చొప్పున పదేళ్లకు 5 శాతం మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఏపీపీఎస్సీ పరీక్ష 450 మార్కులకు జరుగుతుంది. అంటే 22.5 మార్కులు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అదనంగా వస్తాయి. ఒక పోస్టుకు 12 కంటే తక్కువ దరఖాస్తులు అందితే.. స్ర్కీనింగ్ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. వారిని నేరుగా ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.