యూనివర్సిటీ పోస్టుల పాత నోటిఫికేషన్లు రద్దు!
ABN , Publish Date - May 07 , 2026 | 04:13 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్లను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
న్యాయ వివాదాలతో ముందుకు కదలని ఫలితం
తాజాగా 1500 పోస్టులకు 15న నోటిఫికేషన్లు
జాబ్ క్యాలెండర్ మేరకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్లను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2023లో 3220 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేశారు. అయితే, రోస్టర్ అమలులో పొరపాట్లు చేయడంతో దరఖాస్తుల దశలోనే న్యాయ వివాదాలు ఏర్పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ ఏడాది మే 15న 1500 యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అయితే, సాంకేతికంగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దుచేస్తేనే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం సాధ్యమవుతుంది. యూనివర్సిటీల స్థాయిలో పాలక మండళ్ల సమావేశాలు నిర్వహించి నోటిఫికేషన్ల ఉపసంహరణకు తీర్మానం చేయాలని ఉన్నత విద్యాశాఖ సూచించగా అందుకు అనుగుణంగా అన్ని వర్సిటీలు ఈసీ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేశాయి. వాటి ఆధారంగా ఆయా వర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకుంది. దీంతో ఈనెల 15న 1500 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమమైంది. కాగా, అప్పట్లో ఉర్దూ వర్సిటీలో 63, ద్రవిడియన్ వర్సిటీలో 24, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 103, జేఎన్‌టీయూ-అనంతపురంలో 203, ఏయూలో 523, ఎస్వీయూలో 265, ఏఎన్‌యూలో 175, ఎస్కేయూలో 219, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 99, యోగి వేమన వర్సిటీలో 118, అంబేడ్కర్ వర్సిటీలో 99, విక్రమ సింహపురిలో 106, కృష్ణా వర్సిటీలో 86, జేఎన్‌టీయూ-కాకినాడలో 98, రాయలసీమ వర్సిటీలో 103, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీలో 138, ఆర్జీయూకేటీలో 660 పోస్టులకు అప్పట్లో యూనివర్సిటీలు నోటిఫికేషన్లు జారీచేశాయి. మొత్తం మంజూరైన పోస్టులకు కాకుండా కేవలం ఖాళీలకు మాత్రమే రోస్టర్ అమలుచేయాలని తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆదిలోనే వివాదాలు మొదలయ్యాయి. చివరికి దరఖాస్తుల దశలోనే ప్రక్రియ ఆగిపోయింది.