కొండకోనలు దాటొచ్చినా దక్కని ప్రాణం
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:02 AM
పాము కాటుకు గురైన ఓ గిరిజన యువతి కొండకోనలు దాటుకొని వచ్చినా.. సరైన వైద్యం అందక ప్రాణాలు దక్కలేదు. పోలవరం జిల్లా కూనవరం మండలంలోని..
సరైన వైద్యం అందక ఆదివాసీ యువతి మృతి
మంగళగిరి ఎయిమ్స్‌లో అడ్మిట్ కూడా చేసుకోని వైనం
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టించుకోని వైద్యులు
కూనవరం, జూలై 9(ఆంధ్రజ్యోతి): పాము కాటుకు గురైన ఓ గిరిజన యువతి కొండకోనలు దాటుకొని వచ్చినా.. సరైన వైద్యం అందక ప్రాణాలు దక్కలేదు. పోలవరం జిల్లా కూనవరం మండలంలోని కారుమానుకొండకు చెందిన సూట్రు సమ్మక్క ప్రియ (18) ఆదివారం రాత్రి పాము కాటుకి గురైంది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను డోలీ ద్వారా తొలుత కూటూరు ప్రభుత్వ ఆస్పత్రికి, తర్వాత చింతూరు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రియకు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో, వైద్యుల సూచన మేరకు బుధవారం రాత్రి మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు యువతి తండ్రి లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. అక్కడ కనీసం అడ్మిట్ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని చెప్పారు. ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చారంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళితే.. అక్కడా వైద్యులు పట్టించుకోలేదన్నారు. నాడి పట్టుకుని కూడా చూడలేదని వాపోయారు. ఎవరిని అడిగినా వైద్యులు లేరని చెప్పేవారన్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కాళ్లూ చేతులు గిలగిలా కొట్టుకుంటూ తన కుమార్తె చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయే ముందు ఆమె పరిస్థితిని చూడలేక చింతూరు ఐటీడీఏ పీవోకు ఫోన్ చేశామని, ఆయన స్పందించలేదని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె చనిపోయిందని లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు.
డోలీలో మోసుకుంటూ ఆరు గంటలు నడక
సమ్మక్క ప్రియ ప్రతిరోజూ మంచంపై నిద్రపోయేది. ఎందుకో కానీ.. ఆదివారం రాత్రి నేలపై పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆమె చెవి దగ్గర పాము కాటు వేసింది. ఇది గమనించని ఆమె సోమవారం ఉదయం యఽథావిధిగా లేచింది. అయితే తనకు మత్తుగా, కడుపులో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. చెవి దగ్గర చీమ కుట్టినట్టు ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు అది పాము కాటుగా గుర్తించారు. కారుమానుకొండ నుంచి కూటూరు ఆస్పత్రికి కొండలు, దట్టమైన అడవులు దాటి, డోలీని భుజాలపై మోసుకుంటూ కూటూరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమెకు చెవి, ముక్కు నుంచి రక్తం రావడంతో చింతూరు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో.. మృత్యువుతో పోరాడుతూనే గుంటూరు వరకూ వచ్చి ప్రాణాలు విడిచింది.