Share News

రోడ్డు భద్రతకు హైటెక్‌ చర్యలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:06 AM

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం హైటెక్‌ పద్ధతులను ఎంచుకుందని రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

రోడ్డు భద్రతకు హైటెక్‌ చర్యలు

  • 1,500 బస్సుల్లో డ్యాష్‌ కామ్‌ల ఏర్పాటు: మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం హైటెక్‌ పద్ధతులను ఎంచుకుందని రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. వరుస రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బస్సు డ్రైవర్లపై ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం వాహనాల్లో డ్యాష్‌ కామ్‌లు అమర్చనున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలోని 1,500 ప్రైవేటు బస్సుల్లో యజమానుల సొంత ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. డ్రైవర్‌ ప్రవర్తనతో పాటు రోడ్డు ముందు దృశ్యాలను సైతం రికార్డు చేసి వారం రోజుల పాటు నిక్షిప్తం చేస్తాయి. డ్రైవర్‌ సెల్‌ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపినా, మద్యం సేవించి తేడాగా ప్రవర్తించినా వెంటనే డ్యాష్‌ కామ్‌ అప్రమత్తం చేస్తుంది. రవాణా శాఖ కంట్రోల్‌ రూమ్‌ నుంచి డ్రైవర్‌ను వెంటనే అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణీకుల ప్రాణ రక్షణే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 06:07 AM