Share News

కారవాన్‌లో ప్రయాణిస్తూ బోర్డ్‌ మీటింగ్‌

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:58 AM

సాధారణంగా బోర్డు మీటింగ్‌లు అంటే హోటల్‌ రూముల్లోనో, ఆఫీసు మీటింగ్‌ హాల్లోనో జరుగుతుంటాయి. అయితే టూరిజం ప్రమోషన్‌ కోసం...

కారవాన్‌లో ప్రయాణిస్తూ బోర్డ్‌ మీటింగ్‌

  • టూరిజం ప్రమోషన్‌ కోసం ఏపీటీడీసీ వినూత్న ప్రయోగం

  • విజయవాడ నుంచి సూర్యలంక వరకూ రెండు వాహనాల్లో ప్రయాణం

బాపట్ల, జూలై 1(ఆంధ్రజ్యోతి): సాధారణంగా బోర్డు మీటింగ్‌లు అంటే హోటల్‌ రూముల్లోనో, ఆఫీసు మీటింగ్‌ హాల్లోనో జరుగుతుంటాయి. అయితే టూరిజం ప్రమోషన్‌ కోసం ఏపీటీడీసీ బుధవారం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మూడు నెలలకొకసారి జరిగే బోర్డు మీటింగ్‌కు ఈసారి కారవాన్‌ వేదికగా జరిగింది. విజయవాడ పున్నమి హోటల్‌ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వరకు దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించి అందులోనే బోర్డ్‌ మీటింగ్‌ను పూర్తి చేశారు. రెండు కారవాన్‌ వాహనాల్లో ఏపీటీడీసీ సిబ్బంది బుధవారం సూర్యలంకకు వచ్చారు. ఓ దానిలో బోర్డు చైర్మన్‌, డైరెక్టర్లు, స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో పద్మావతితో పాటు ఇతర అధికారులు, మరో దానిలో సిబ్బంది ప్రయాణించారు. కారవాన్‌ వాహనం చుట్టూ ఏపీ టూరిజం స్టిక్కర్లు ఉండడం, వాహనాలు వినూత్నంగా ఉండడంతో దారి పొడవునా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పర్యాటక రంగం ప్రచారంలో భాగంగానే ఈ వినూత్న పంథాను ఎంచుకున్నామని, ఈ బోర్డ్‌ మీటింగ్‌ సరికొత్త అనుభూతి ఇచ్చిందని సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు. టూరిజం ప్రమోషన్‌ విషయంలో సీఎం సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకునే కారవాన్‌లో మీటింగ్‌ నిర్వహించామని ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ తెలిపారు.

బోర్డు తీసుకున్న నిర్ణయాలివి..

కారవాన్‌లో జరిగిన ఏపీటీడీసీ బోర్డు మీటింగ్‌ వివరాలను చైర్మన్‌ నూకసాని బాలాజీ బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోటింగ్‌ కార్యకలాపాలను విస్తరించడానికి సోలార్‌ బోట్లను సిద్ధం చేయడంపై చర్చించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో దిండి, రాజమండ్రి, రుషికొండ, శ్రీశైలం, భవానీ ద్వీపంలో బోటింగ్‌ కార్యకలాపాలు పెంచుతామన్నారు. ఓఅండ్‌ఎం నిర్వహణ కింద 67హోటళ్లు, టూరిజం నిర్వహణలోనే మరో 40 హోటల్స్‌ ఉన్నాయని బాలాజీ తెలిపారు. కాగా, డబ్బు కట్టకుండానే లీజుకు భూములు ఇచ్చేశామంటూ ఈ రోజు ఓ మీడియా ప్రసారం చేసిందని, అది సరికాదని పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 03:58 AM