‘వీబీ జీరామ్‌జీ’లో ఏపీ భేష్
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:56 AM
ఉపాధి హామీ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(వీబీ జీరామ్‌జీ) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే..
ఉపాధి కల్పనలో తొలిరోజే అగ్రగామిగా నిలిచింది.. కేంద్ర మంత్రి చౌహాన్ ప్రశంసలు
కూలీల సామాజిక భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడి.. కూలి రూ.300 తగ్గదని స్పష్టీకరణ
రాష్ర్టాలకు తొలి విడతగా రూ.25,863 కోట్లు విడుదల.. రాష్ర్టానికి రూ.1414 కోట్ల నిధులు
న్యూఢిల్లీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(వీబీ జీరామ్‌జీ) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే రికార్డు స్థాయిలో కూలీలకు పనులు కల్పించి కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ నుంచి ప్రశంసలందుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ఉన్నతాధికారులతో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతన పథకం అట్టహాసంగా ప్రారంభం కావడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వ పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కూ.25,863 కోట్లను మొదటి విడతగా విడుదల చేశారు.
పనుల జోరు పెంచాలి
నూతన పథకం పరివర్తన (ట్రాన్సిషన్) అత్యంత సాఫీగా సాగిందని, ఎక్కడా సాంకేతిక, కార్యాచరణ లోపాలు తలెత్తకపోవడం శుభపరిణామమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మొదటి వారంలోనే దేశంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల్లో పనులు మొదలయ్యాయని, లక్షలాది మంది చేతులకు పని దొరికిందని వివరించారు. ఈ క్రమంలో తొలి రోజే అత్యధికంగా ఉపాధి కల్పించిన ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ర్టాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో మిగిలిన పంచాయతీల్లోనూ పనుల జోరు పెంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు, పనుల ప్రారంభంలో వెనుకబడిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలు తక్షణమే స్పందించి అన్ని పంచాయతీల్లో పనులు మొదలుపెట్టాలని, జార్ఖండ్ త్వరితగతిన బడ్జెట్ నిబంధనలు పూర్తి చేయాలని కోరారు. ఆర్‌బీఐ ఖాతాల వంటి సాంకేతిక ప్రక్రియలు పెండింగ్‌లో ఉన్న రాష్ర్టాలు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
15 రోజుల్లోనే చేతికి డబ్బులు
గ్రామీణ కూలీల సామాజిక భద్రతకు కట్టుబడి ఉన్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. ఈ పథకం ద్వారా కూలి రేట్లను సగటున 10 శాతం పెంచినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇకపై దినసరి కూలి రూ.300 కంటే తక్కువ ఉండటానికి వీల్లేదని అన్నారు. కూలీలకు 15 రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసమే నిధులను ముందుగానే విడుదల చేశామని, రాష్ర్టాలు సైతం తమ మ్యాచింగ్ షేర్ (సమభాగ నిధులు) ను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని మంత్రి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా పని చేయాలని, స్థానిక అవసరాలకు తగ్గట్లు గ్రామసభల్లోనే పనులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలకూ తావులేకుండా నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు. ఇందులో భాగంగా ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు), జియో-ట్యాగింగ్ వంటి సాంకేతిక విధానాలను వంద శాతం పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ర్టాల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ‘ఏరియా ఆఫీసర్ల’ను నియమించినట్లు కేంద్రమంత్రి వివరించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని, సహాయ మంత్రి కమలేశ్ పాశ్వాన్, ఏపీ సహా వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.