Share News

డిజిటల్‌ హెల్త్‌లో ఏపీ టాప్‌

ABN , Publish Date - May 20 , 2026 | 03:56 AM

రోగుల ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేయడంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ) వెల్లడించింది.

డిజిటల్‌ హెల్త్‌లో ఏపీ టాప్‌

  • 6.17 కోట్ల మందికి అభా కార్డులు

  • 2.03 కోట్ల మందికి ఈ-ప్రిస్ర్కిప్షన్‌ ద్వారా మందులు

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రోగుల ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేయడంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ) వెల్లడించింది. విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో ఈ-హాస్పిటల్‌ విధానం, ఉపయోగాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఈ-ప్రిస్ర్కిప్షన్‌, అభా ఐడీల అనుసంధానంలో ముందున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఎన్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సీజే ఆంటోని మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 4003 ప్రభుత్వాస్పత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కింద నెక్ట్స్‌జెన్‌ ఈ హాస్పిటల్‌కు అనుసంధానం అయ్యాయన్నారు. అభా (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) ఐడీల జారీ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 60.1 కోట్ల మంది రోగులు ఓపీ రిజిస్ట్రేషన్‌ చేసుకోగా ఒక్క ఏపీలోనే 6.17 కోట్ల మంది అభా ఐడీ ద్వారా ఓపీ సేవలు పొందారన్నారు. జాతీయస్థాయిలో ఈ-ప్రిస్ర్కిప్షన్‌ విధానం అమలులో ఏపీ ముందంలో ఉందన్నారు. ఏపీలో ఇప్పటి వరకూ 2.03 కోట్ల మందికి ఈ-ప్రిస్ర్కిప్షన్‌ ద్వారా వైద్యులు మందులు అందించారని చెప్పారు.

Updated Date - May 20 , 2026 | 03:57 AM