పొగాకు కొనుగోళ్ల ప్రక్రియపై నిఘా ఉంచండి
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:42 AM
రాష్ట్రంలో వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియపై నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశం
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియపై నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ రకం పొగాకైనా కిలో ధర రూ.200 కన్నా తక్కువ కాకుండా వ్యాపారులు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. శుక్రవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీతో కలిసి, పొగాకు కొనుగోళ్లు జరిగే జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025-26లో 142 మిలియన్ కిలోల పంట పరిమాణం నిర్ణయించినా.. పొగాకు ఉత్పత్తి 236 మిలియన్ కిలోలకు చేరిందని, కొనుగోలుదారుల స్పందన లేక, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూలతతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అందువల్ల 2026-27లో 81 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని పొగాకు బోర్డు నిర్ధారించిన విషయాన్ని ప్రస్తావించారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా భాగస్వామ్య పక్షాలతో త్వరలో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని చెప్పారు. ఖరీఫ్‌కు యూరియా, డీఏపీ సహా ఎరువులన్నీ సమృద్ధిగా ఉన్నాయని, ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడాలని, నిల్వలు, పంపిణీ, రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్, వ్యవసాయేతర అవసరాలకు అక్రమ తరలింపు అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.