Share News

24లోగా తల్లికి వందనం

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:02 AM

బడులకు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.

24లోగా తల్లికి వందనం

  • మెగా పీటీఎం నాటికి ఖాతాల్లోకి నగదు.. తొలి విడతలో 66.9 లక్షల మంది తల్లులకు

  • కొత్తగా చేరే వారికి తదుపరి దశలో నిధులు.. నేడు 10 వేల కోట్లకు పాలనా అనుమతులు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): బడులకు వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ నెల 24న మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. పథకం నిధులకు సంబంధించిన పరిపాలనా అనుమతుల ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. తొలి విడతలో రూ.10,049 కోట్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 66.9లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం విద్యార్థికి రూ.2 వేలు చొప్పున ఆయా పాఠశాలలకు కేటాయిస్తారు. కాగా, అడ్మిషన్లకు ఇంకా సమయం ఉన్నందున కొత్తగా చేరేవారికి రెండో విడతలో నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు, ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు.

Updated Date - Jul 15 , 2026 | 04:03 AM