11 ల్యాబ్‌ల ఆధునికీకరణ
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:28 AM
‘ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు రాష్ట్రంలోని 11 ల్యాబ్‌లను స్టేట్ ఫుడ్ ల్యాబ్‌లుగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టాం’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
అత్యాధునిక పరికరాలతో స్టేట్ ఫుడ్ ల్యాబ్స్‌గా మార్పు
నెల రోజుల్లో విశాఖలో, 4 నెలల్లో గుంటూరులోనూ
ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ వచ్చాక తిరుమలలో పూర్తిస్థాయిలో పరీక్షలు: మంత్రి సత్యకుమార్
తిరుపతి(టీటీడీ), మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు రాష్ట్రంలోని 11 ల్యాబ్‌లను స్టేట్ ఫుడ్ ల్యాబ్‌లుగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టాం’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. శనివారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నెల రోజుల్లో విశాఖలో, 4 నెలల్లో గుంటూరులోనూ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. కర్నూలులో సైతం ఒక స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను నోటిఫై చేశాం. రెండేళ్లలో ల్యాబ్‌లన్నింటినీ పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లోకి తీసుకువస్తాం. అత్యధికంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్యానికి... ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలకు గురవుతున్నారు. నాణ్యమైన పదార్థాల వాడకంపై అవగాహన కల్పిస్తాం. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్(ఐపీఎం) ఫుడ్ సెఫ్టీ నేతృత్వంలో దాడులు చేస్తాం. లీగల్ మెట్రాలజీతో కలసి శాంపిల్స్ తీసుకువచ్చి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 2014లో రాష్ట్రం విడిపోయినా ఐపీఎం శాఖ విభజన మాత్రం 2022లో జరిగింది. ఇందులో 723 మంది సిబ్బందికిగాను 144 మంది మాత్రమే ఉన్నారు. ప్రధాన కార్యాలయంలో 279 మందికిగాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లగా 150 పోస్టులను మంజూరు చేశారు. తిరుమలలో శనివారం ప్రారంభమైన ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ రావాలి. అందుకు ఏడాది సమయం పడుతుంది. అది వస్తే పూర్తిస్థాయి పరీక్షలకు వీలుంటుంది. అప్పటి వరకూ ఇక్కడ అనాలసి్‌సలు మాత్రమే జరుగుతాయి. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా బ్లాక్‌చెయిన్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు’ అని మంత్రి తెలిపారు.