అరుదైన వ్యాధులకు నాణ్యమైన వైద్యం
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:43 AM
అరుదైన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారికి ఆర్థికపరమైన భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో కొత్త పాలసీని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొస్తాం: మంత్రి సత్యకుమార్
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): అరుదైన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారికి ఆర్థికపరమైన భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో కొత్త పాలసీని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ‘అరుదైన వ్యాధులు, నిర్ధారణ, చికిత్స అందించేందుకు ఉన్న మార్గాలు- భాగస్వాముల అభిప్రాయాల సేకరణ’ అనే అంశంపై బుధవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... ఆర్థిక స్థోమత లేదని, అరుదైన వ్యాధి అనే కారణాలతో రోగులు వైద్యానికి దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కర్నూలు, తిరుపతి, విశాఖపట్నంలో ఒక్కొక్కటి చొప్పున రిఫరల్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ప్రత్యేక చికిత్స, బాధితులకు మానవత్వంతో కూడిన సంరక్షణ అందించడం ముఖ్యమని తెలిపారు. పుట్టిన పిల్లల్లో అరుదైన వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు యూనివర్శల్ నియోనాటల్ స్ర్కీనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అరుదైన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన చికిత్స అందించే విధానాన్ని కేరళలో బాగా అమలు చేస్తున్నారని, దీన్ని పరిశీలించి మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు.