Share News

ఒకటో తరగతి నుంచే విలువల విద్య!

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:23 AM

నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలువల విద్యను ప్రవేశపెట్టింది.

ఒకటో తరగతి నుంచే విలువల విద్య!

  • తల్లిదండ్రులు, గురువులను ఎలా గౌరవించాలి?

  • క్రమశిక్షణ, సహనంపైనా పాఠాలు

  • ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

  • పరీక్షల్లో వాటికీ మార్కులు

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలువల విద్యను ప్రవేశపెట్టింది. గతేడాది 6 నుంచి 10వ తరగతి వరకు విలువల విద్యను అమలుచేయగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు పుస్తకాలు ముద్రించింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను ఈ పుస్తకాలుగా మార్చారు. విద్యార్థులకు ఇంకా సులభంగా అర్థంకావాలనే ఉద్దేశంతో ఆయా పాఠ్యాంశాల సారాంశం ఆధారంగా కృత్రిమ మేధ(ఏఐ)తో ఫొటోలు రూపొందించి ముద్రించారు. తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలి? కుటుంబంతో ఎలా మెలగాలి? మాట తీరు ఎలా ఉండాలి? అనే అంశాలు ఇందులో పొందుపరిచారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్నేహ భావంపై పాఠ్యాంశాలు రూపొందించారు. మంచి మనో నిర్మాణం, ఏకాగ్రత, కోపాన్ని నియంత్రించుకోవడం, ఓర్పు, క్రమశిక్షణగా నడుచుకోవడంపై కొన్ని పాఠాలు పెట్టారు. ప్రకృతి విలువ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఏర్పడేలా కొన్ని పాఠాలు రూపొందించారు. ఒక్కో పుస్తకాన్ని 45 నుంచి 50 పేజీలతో తయారుచేశారు. విద్యార్థులు విద్యాపరంగా రాణించడంతో పాటు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మారడమే విలువల విద్య లక్ష్యం అని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. ఈ ఏడాది నుంచి విలువల విద్యకూ మార్కులు ఇవ్వనున్నారు. ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌లో నాలుగు మార్కులు, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌లో 8 మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. తెలుగు సబ్జెక్టులో విలువల విద్యను భాగం చేస్తున్నారు. ప్రస్తుతం శనివారాన్ని నో బ్యాగ్‌ డేగా అమలుచేస్తున్నారు. ఆ రోజు విలువల విద్య బోధించేలా టైమ్‌టేబుల్‌ రూపొందిస్తున్నారు.


లోకేశ్‌ ఆలోచనతోనే విలువల విద్య!

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ భావించారు. ఆయన విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణ విద్యతో పాటు విద్యార్థుల్లో విలువలు పెంచాలని, అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించారు. చాగంటితో పలు ప్రాంతాల్లో విద్యార్థులకు విలువలపై ప్రసంగాలు ఇప్పించారు. ఆ ప్రసంగాలనే పుస్తకాలుగా మార్చి విద్యార్థులకు అందిస్తున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 04:25 AM