ఆస్పత్రుల్లో ఏఐ డాక్టర్లు
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:27 AM
పెరుగుతున్న వ్యాధులు, ప్రజారోగ్య అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (ఏఐ) డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని: సీఎం
కర్నూలు జిల్లా ఆస్పరిలో పథకానికి శ్రీకారం
ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కూటమి లక్ష్యం
ప్రతి వ్యక్తికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
గొడ్డలి పార్టీ నేతలు పగటి వేషగాళ్లు
ఒక్క పరిశ్రమ కూడా తేలేదు
2028లో కడప స్టీల్ పరిశ్రమ ప్రారంభం
రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌గా సీమ
కర్నూలు-బళ్లారి ఎన్‌హెచ్ నిర్మిస్తాం: బాబు
విద్య, వైద్యానికి ప్రతి కుటుంబం అత్యధికంగా ఖర్చు చేస్తోంది. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తోంది. దీంతో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా సంజీవని పథకం రూపొందించాం.
ప్రజారోగ్యం కాపాడడంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఒక్కటే సరిపోదు.. జనంలో ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి. మంచి ఆహారం, యోగా, ధ్యానం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.
- సీఎం చంద్రబాబు
కర్నూలు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న వ్యాధులు, ప్రజారోగ్య అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ మేధ (ఏఐ) డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోని ఆరోగ్య సూత్రాలను ప్రజల వద్దకు తీసుకొస్తామన్నారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో సంజీవని పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఎ.సిరి అధ్యక్షతన జరిగిన ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని.. సం జీవని పథకాన్ని ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమ లు చేస్తామన్నారు. ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డిజిటల్ సర్వ్ సెంటర్లను ఈ పథకంలో భాగం చేస్తామ ని చెప్పారు. ప్రతి వ్యక్తికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, కుటుంబ సభ్యులకు అభా హెల్త్ ఐడీ లు జారీ చేస్తామన్నారు. ‘రాష్ట్రంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆధార్ కార్డు చూపిస్తే మీ ఆరోగ్య వివరాలు.. వైద్య చికిత్సలు తెలుస్తాయి. ఆన్‌లైన్‌లో మీకు నచ్చి న వైద్యుడిని ఎంచుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
వ్యాధులు రాకముందే..
ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత వైద్యసేవ లు అందించడం కాదు.. వ్యాధులు రాకముందే గుర్తించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, స మర్థ వైద్యం అందించడం సంజీవని ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ పరిస్థితులను తగ్గించేందుకే ఈ పథకాన్ని తెచ్చాం. అంటువ్యాధులు కానివి, మాతా-శిశు ఆరోగ్యం, బాలల ఆరోగ్య పరీక్షలు, 108 అత్యవసర సేవలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ-ఔషది, ల్యాబ్ సేవలను డి జిటల్ వ్యవస్థలోకి తీసుకొస్తాం. సంజీవని సిటిజన్ వెల్‌నెస్ యాప్ ద్వారా వైద్యులను బుక్ చేసుకోవడం, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
మీ ఆస్తులకు భద్రత..
గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు చేశా రు. 22ఏ తీసుకొచ్చి మీ ఆస్తులు వారి చేతుల్లో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మీ ఆస్తులకు భద్రత, రక్షణగా నిలిచింది. డిజిటల్ పాస్ పుస్తకాలు తీసుకొచ్చాం. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతి నెలా 9న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తాం.
కరువు సీమలో పారిశ్రామిక పురోగతి..
రాయలసీమ రాళ్ల సీమ కాదు.. ఇది రతనాల సీమ. గత నెలలో జొన్నగిరి వద్ద దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్‌మైన్ ప్రారంభించాం. జొన్నగిరిని స్వర్ణగిరిగా మార్చాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తాం. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడి రాష్ట్రాన్ని వీడిపోతే.. మన ప్రభుత్వం వచ్చాక హీరో మోటార్స్, దాల్మియా వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ వచ్చింది. పుట్టపర్తి వద్ద ఐదోతరం యుద్ధ విమానాలు తయారుకానున్నాయి. కడప స్టీల్ ప్టాంట్‌ను 2028లో ప్రారంభిస్తాం. సీమను పారిశ్రామిక హబ్‌గానే గాక.. రూ.లక్ష కోట్లలో హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తున్నాం. రూ.40 వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడితే.. ప్రైవేటు సంస్థలు రూ.60 వేల కోట్లు పెడతాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కర్నూలు-బళ్లారి జాతీయ రహదారి నిర్మాణం చేపడతాం.
ప్రతి కుటుంబానికీ అండగా..
ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యం. ప్రతి కుటుంబానికీ అండగా నిలవాలనే సంకల్పంతో సాగుతున్నాం. ఒకటో తేదీనే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటికొచ్చి పింఛన్ డబ్బులు చేతిలో పెడుతున్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌గా వెళ్తున్నాయి. ఇదో విప్లవం. దీపం-2.0 కింద ఏటా 3 వంటగ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 4 నెలలకోసారి ఖాతాల్లో గ్యాస్ డబ్బులు జమ చేస్తున్నాం.
నేను కామన్ మ్యాన్
నేనెప్పుడూ ప్రజల కోసం.. ప్రజల మధ్యలో ఉం టూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కామన్ మ్యాన్‌ను. స్వేచ్ఛగా నా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉంది. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా పరదాలు కట్టడం లేదు.. చెట్లు నరకడం లేదు. నేను, ప్రధాని మోదీ, నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎప్పు డూ ప్రజల సంక్షేమం, అభివృద్దే ఆలోచిస్తాం. ఎల్‌నినో పరిస్థితులను సమష్టిగా ఎదుర్కొవాలి.
ఒకే పార్టీ.. ఒకే వర్గం
టీడీపీలో వర్గాలు, కుమ్మలాటలను సహించనని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఒకే పార్టీ.. ఒకే వర్గంగా ఉండాలని, వర్గాలను ప్రేరేపిస్తే చూ స్తూ ఊరుకునేది లేదన్నారు. ఆలూరు నియోజకర్గ కార్యకర్తల భేటీలో ఆయన మాట్లాడారు. ఆలూరులో బలమైన కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.
అది దౌర్భాగ్య పార్టీ..
‘మనం కష్టపడి రాష్ట్రాభివృద్ధి కోసం ముం దుకు వెళ్తుంటే.. ఇక్కడో దౌర్భాగ్య పార్టీ ఉంది.. ఆ పార్టీ ఏది తమ్ముళ్లూ..’ అని చంద్రబాబు అడగగా నే.. ‘గొడ్డలి పార్టీ’ అంటూ జనం ముక్తకంఠంతో నినదించారు. ఆ పార్టీ నాయకులు పగటి వేషగాళ్లని సీఎం ఎద్దేవాచేశారు. ‘ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు.. ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చి మళ్లీ రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల లో సీమ ప్రాజెక్టులకు రూ.12,400 కోట్లు ఖర్చు చే శాం. రాబోయే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టు లు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ రూ పొందించాం. ఆ జాబితాలో వేదవతి ప్రాజెక్టు కూ డా ఉంది. దీనిని రూ.1,768 కోట్లతో పూర్తి చేస్తాం. కర్నూలు జిల్లాలో నగరడోణ జలాశయానికి రూ. 38 కోట్లతో పనులు చేపట్టి పూర్తి చేస్తాం. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చిలో జాతికి అంకితం చేస్తాం. గత పాలకులు రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వారి మోసపూరిత రాజకీయాలను నమ్మొద్దు’ అని ప్రజలకు సూచించారు.
ఉమ్మడి కుటుంబంతో చంద్రన్న
ఆస్పరి పీహెచ్‌సీలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆస్పరికి చెందిన 26 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబంతో ముచ్చటించారు. యాగంటి రాముడు, సుభద్రమ్మ దంపతులకు నలుగురు కొడుకులు సంతానం. వారందరికీ వివాహాలు చేశారు. వారికి పిల్లలు, ఆ పిల్లలకు సంతానం.. ఇలా 3 తరాలకు చెందిన 26 మంది కుటుంబ సభ్యులు ఉమ్మడిగానే ఉంటున్నారు. కలసి ఉంటే సంపద పెరుగుతుందన్నారు. సంజీవని ద్వారా ఆస్పరి పీహెచ్‌సీలో పురుడు పోసుకున్న బాలింత సుజాతమ్మతో చంద్రబాబు మాట్లాడారు. చిన్నారి పేరిట రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలని చెక్కును అందజేశారు.