మహిళా బిల్లుకు మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ!
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:32 AM
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటివారంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
నెలాఖరులో లేదంటే మే మొదటి వారంలో
ఇండీ కూటమి మహిళా వ్యతిరేకి.. విపక్షాలు చేసిన అన్యాయాన్ని సభలో ఎండగడదాం
టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పిలుపు
ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి
వ్యవసాయం మరింత బలోపేతం కావాలి
సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటివారంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ఇండీ కూటమి పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని ఎన్‌డీఏ నేతలకు సూచించారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకున్న ఇండీ కూటమి తీరును నిరసిస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీల వైఖరిని ఎండగడుతూ నిరసనలు చేపట్టాలన్నారు. బిల్లును అడ్డుకుని ఇండీ కూటమి పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఎన్‌డీఏ పార్టీలు మొదటి నుంచీ కృషి చేస్తున్నాయన్నారు. ‘కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు మహిళలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి. ఇండి కూటమి పార్టీల తీరును నిరసిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. స్త్రీశక్తి పేరుతో సదస్సులు నిర్వహించాలి. టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు సమన్వయంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలి’ అని వివరించారు. 1996 నుంచీ చట్టసభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటూనే ఉందన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతిచ్చినా.. లోక్‌సభలో కాంగ్రెస్ బిల్లు పెట్టలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండీ కూటమి అడ్డుకుందన్నారు.
డీలిమిటేషన్ సాకు చెప్పి బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వీగిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాదికి ఎలాంటి ఇబ్బందీ లేదని, ఏ రాష్ట్రానికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా చెప్పారని, అవసరమైతే బిల్లులో మార్పులు చేస్తామని స్పష్టం చేసినా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. ఎన్‌డీఏ మహిళా పక్షపాతి... ఇండీ కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. మహిళలకు తొలి నుంచీ ప్రాధాన్యమిచ్చిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. దేశంలో మహిళా విశ్వవిద్యాలయాన్ని తొలిసారిగా ఎన్టీఆరే పెట్టారని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించింది టీడీపీయేనని చంద్రబాబు తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.