123 మునిసిపాలిటీల్లో ఒకే దఫా ఎన్నికలు!
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:36 AM
రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
కోర్టు కేసులున్న 23చోట్ల ఉపసంహరణకు చర్యలు
మంత్రి, అధికారులతో సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన మున్సిపల్ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గతంలో 100 పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. మరో 23 మునిసిపాలిటీలకు కోర్టు కేసుల కారణంగా జరుపలేదు. ఈ కేసులు ఉపసంహరింపజేసి వీటిలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో మంజూరైన కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరగా పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం.