ఫైటర్ జెట్స్.. మేడిన్ ఏపీ
ABN , Publish Date - May 05 , 2026 | 04:22 AM
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మన దేశ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది.
పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్
600 ఎకరాల్లో ఏర్పాటుకు డీఆర్‌డీవో ప్రతిపాదన
రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం
ప్లాంట్‌లో 140 ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీ
ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మన దేశ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ యుద్ధవిమానాల తయారీ కేంద్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రక్షణశాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏరో అండ్ డిఫెన్స్ పాలసీని ఐటీ అండ్ ఎలకా్ట్రనిక్స్ శాఖ రూపొందించింది. రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరికరాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం కావడంతో పాటు.. ప్రతిష్ఠాత్మక జెట్ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకు రావడంతో రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్ శాఖ వెంటనే ఆమోదం తెలిపింది. పుట్టపర్తి కేంద్రంలో డీఆర్‌డీవో దాదాపు 140 అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం సీఎం ఢిల్లీ వెళ్లినపుడు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. యుద్ధ విమాన తయారీ కేంద్రం స్థాపనపై అప్పట్లో వారి మధ్య చర్చ జరిగింది.