Share News

విదేశాల్లోనూ ‘లేపాక్షి’

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:57 AM

రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్తకళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు.

విదేశాల్లోనూ ‘లేపాక్షి’

  • అమరావతిలో 10 ఎకరాల్లో నిఫ్ట్‌

  • త్వరలో నేతన్న భరోసా పథకం: మంత్రి సవిత

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్తకళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని బీసీ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. విదేశాల్లో కూడా లేపాక్షి షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అమరావతిలో పది ఎకరాల విస్తీర్ణంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) ఏర్పాటుకు నిర్ణయించామని తె లిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. శనివారం అమరావతి సచివాలయంలో రెండేళ్ల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ‘356 రోజులూ చేనేతలకు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఏపీ టెక్స్‌టైల్స్‌ అపెరెల్‌, గార్మెంట్‌ పాలసీ 2024-29 తీసుకొచ్చాం. 93 వేల మంది నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందజేస్తున్నాం. నూలును 15 శాతం రాయితీతో అందిస్తున్నాం. ధ ర్మవరంలో 38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్‌ నిర్మిస్తున్నాం. మంగళగిరిలో, పిఠాపురంలో చేనేత పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 10 కోట్లతో పలు చోట్ల చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. శాఖమూరు, అమరావతిలో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మించబోతున్నాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో పీఎం ఏక్తా మాల్‌ నిర్మిస్తున్నాం. నేతన్నల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 2.05 లక్షల మంది హస్తకళాకారులను గుర్తించాం. విదేశాల్లో లేపాక్షి షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్నాం’ అన్నారు.


2014-19 చేనేత రంగానికి స్వర్ణయుగమని, ఆనాటి టీడీపీ ప్రభుత్వం నేతన్నల మేలు కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల మాదిరిగానే చేనేత రంగానికి తీవ్ర నష్టం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేతన్నలు ఊపిరిపీల్చుకోగలిగారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్‌ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి సీఈవో సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 04:58 AM