తూర్పు-పశ్చిమ కార్గో కారిడార్‌గా ఏపీ
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:42 AM
రాష్ట్రంలోని పోర్టుల్లో విస్తృమైన రవాణా సంబంధిత కార్యకలాపాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు-పశ్చిమ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నూతన పోర్టుల్లో త్వరితగతిన కార్యకలాపాలు
పొరుగు రాష్ట్రాల కార్గో ఇక్కడి నుంచి వెళ్లేలా చర్యలు
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం.. సీఎం ఆదేశాలు
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోర్టుల్లో విస్తృమైన రవాణా సంబంధిత కార్యకలాపాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు-పశ్చిమ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న పోర్టుల్లో త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశించారు. సోమవారం ఆయన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మూడు పోర్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా పూర్తయిన తర్వాత కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని పేర్కొన్నారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక రైల్వే మార్గం వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం చెప్పారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమటక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.