Share News

రాష్ట్రంలో 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:52 AM

రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని..

రాష్ట్రంలో 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి

  • ప్రపంచస్థాయి ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యం

  • విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయం పెరగాలి

  • ‘డిజి 100 ఎక్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో మంత్రి లోకేశ్‌

విశాఖపట్నం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘డిజి 100 ఎక్స్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఉన్నత విద్యా సదస్సుకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విద్యాసంస్థ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. మొబైల్‌ తయారీని ఉదాహరణగా పేర్కొంటూ.. కెమెరా లెన్స్‌, స్ర్కీన్‌ డిస్‌ప్లే, బ్యాటరీ, కేసింగ్‌ తదితర భాగాలను తయారుచేసే అనుబంధ పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వీటికి ప్రపంచ స్థాయి మానవ వనరులు అవసరమని, ఆ బాధ్యతను విద్యాసంస్థలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌కు శ్రీకాకుళంలో క్లస్టర్‌

ఉత్తరాంధ్రలో లభించే అరుదైన ఖనిజ సంపద (రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌) ప్రాసెసింగ్‌ కోసం శ్రీకాకుళం ప్రాంతంలో ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేస్తామని లోకేశ్‌ చెప్పారు. ఖనిజాలను ఎగుమతి చేయడమే కాకుండా, తవ్వకాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం పరిశ్రమల శ్రేణిని అభివృద్ధి చేయాలన్నారు. ఇందులో కూడా పరిశ్రమలు, పరిశోధన, విద్యాసంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. ఉత్తరాంధ్రలో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న మాన్సాస్‌ విద్యాసంస్థలను అభినందించారు. సమావేశంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌, ఏపీ కాలేజియేట్‌ కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్తా, శ్రీసిటీ ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ యూనివర్సిటీ చైర్మన్‌ శ్రీనిరాజు, డిజి సీఈవో హేమంత్‌ సహాల్‌, అపోలో ఆస్పత్రి జెఎండీ డాక్టర్‌ సంగీతరెడ్డి, ‘విట్‌’ ఉపాధ్యక్షులు శేఖర్‌ విశ్వనాథన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 05:54 AM