Share News

200 ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్‌

ABN , Publish Date - May 23 , 2026 | 05:24 AM

అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కమిటీగా ఏర్పడి.. రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

200 ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్‌

  • అద్భుత సందర్శనీయ ప్రాంతాలను గుర్తించాలి

  • 3 శాఖల అధికారులతో కమిటీ.. డిప్యూటీ సీఎం ఆదేశం

అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కమిటీగా ఏర్పడి.. రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. సుమారు 200 ప్రాంతాలను గుర్తించి, అక్కడి సౌకర్యాల వివరాలు సేకరించి, ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి దుర్గేశ్‌తో కలిసి పవన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలతో పాటు దేవాలయాలను దర్శించే భక్తులు, యాత్రికులకు భద్రత కల్పించాలన్నారు. దీనివల్ల 50 వేల మందికి ఉపాధి లభించడంతో పాటు పూర్తి భద్రమైన రాష్ట్రంగా ఏపీకి జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ‘విశిష్ఠత, ప్రత్యేకతలున్న గ్రామాలకు పర్యాటక శోభ తేవాలి. అక్కడ సౌకర్యాలు లేక చాలా మంది ఆసక్తి చూపడం లేదు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలి. ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళితే వారు ఇళ్లలోనే తగిన సదుపాయాలు కల్పిస్తారు. అతిథిని దేవుడిలా చూసుకుంటారు. అలాంటి విధానం మన గ్రామాల్లోనూ తీసుకురావాలి. పైలట్‌ ప్రాజెక్టులుగా కొన్ని గ్రామాలను ఎంచుకుని, పర్యాటక అభివృద్ధి చేస్తే వాటి ముఖచిత్రం మారుతుంది.


కర్నూలు జిల్లా కృష్ణ జింకలు, నల్లమలలోని బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షులు.. ఇలా ప్రత్యేకతలను గుర్తించి, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలి. వీటికి రూట్‌ మ్యాప్‌ రూపొందించాలి. ప్రకృతికి, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా 200 దర్శనీయ ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా తయారు చేయాలి. జూన్‌ 10లోపు వీటిపై ఎంవోయూలు చేసుకోవాలి’ అని పవన్‌ సూచించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ దేవదాయ, పర్యాటక శాఖల సేవలను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలన్నారు. ఎకో, టెంపుల్‌ టూరిజంపై గతంలో ఇచ్చిన సూచనల మేరకు దైవ దర్శనంతో పాటు సమీప ప్రకృతి ప్రాంతాలను కలిపి కాంబో టూరిజం ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు.

Updated Date - May 23 , 2026 | 05:25 AM