Share News

మూడు నెలలకోసారి జాబ్‌ మేళాలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:00 AM

ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

మూడు నెలలకోసారి జాబ్‌ మేళాలు

  • ప్రతి దరఖాస్తును క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలి

  • అధికారులకు మంత్రి లోకేశ్‌ ఆదేశాలు

  • ఈ ఏడాది ప్రభుత్వ బడుల్లో భారీగా అడ్మిషన్లు

  • ‘ప్రైవేటు’ నుంచి 1,06,000 మంది చేరిక

  • విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై మంత్రి సమీక్ష

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్‌ మేళాలు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. విద్య, నైపుణ్య శాఖలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. జాబ్‌ మేళాల ద్వారా ఇప్పటివరకు 1,39,422 మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీల స్థాపన కోసం దేశానికి మోడల్‌గా నిలిచే చట్టాన్ని రాష్ట్రంలో తీసుకురావాలని లోకేశ్‌ సూచించారు. జూలైలో నైపుణ్యం పోర్టల్‌ ఆవిష్కరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో నమోదైన వారికి ఆన్‌లైన్‌ స్కిల్‌ కార్డు జారీచేస్తామన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నారు. యూనివర్సిటీల్లో పోస్టులకు 1,89,316 దరఖాస్తులు అందాయని అధికారులు వివరించగా, ప్రతి దరఖాస్తును క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలని మంత్రి సూచించారు. యూనివర్సిటీ యూనిట్‌గా పోస్టులను భర్తీ చేస్తున్నందున.. ఎంపిక కమిటీలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. కేంద్ర సహకారంతో అన్ని ఐటీఐల్లో ఏఐ ల్యాబ్స్‌ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జపాన్‌లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు డిమాండ్‌ ఉన్నందున, ఆ కోర్సులు చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించాలని అధికారులకు లోకేశ్‌ సూచించారు. త్వరలో నిర్వహించబోయే జిల్లాస్థాయి నైపుణ్య అధికారుల సమావేశం నాటికి కేపీఐ డ్యాష్‌బోర్డు అందుబాటులోకి రావాలని మంత్రి స్పష్టం చేశారు.


గరిష్ఠ సామర్థ్యం మేరకు అడ్మిషన్లు

రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1,06,000 మంది విద్యార్థులు వచ్చారని పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరించారు. 7620 ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ఠ సామర్థ్యం మేరకు అడ్మిషన్లు జరిగాయన్నారు. 159 ప్రాథమిక పాఠశాలలు మోడల్‌ ప్రైమరీ పాఠశాలలుగా మారాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ర్టాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 175 లీప్‌ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్‌ సబ్జెక్టులకు ఏఐ ట్యూటర్‌ విధానం పైలెట్‌గా ప్రారంభిస్తున్నామని అధికారులు వివరించారు. క్లిక్కర్లకు ఏఐ ట్యూటర్‌ను అనుసంధానించాలని మంత్రి సూచించారు. అమరావతిలో రాష్ట్ర సెంట్రల్‌ లైబ్రరీ, విశాఖలో జిల్లా సెంట్రల్‌ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ భవన నమూనాలను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతితో రాష్ట్ర సెంట్రల్‌ లైబ్రరీకి శంకుస్థాపన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, భరత్‌ గుప్తా, తమీమ్‌ అన్సారియా, గణే్‌షకుమార్‌, దీవెన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 05:01 AM