ఆ నియామకాలన్నీ పూర్తి చేస్తాం
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:42 AM
లోకాయుక్తతోపాటు మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్‌ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లకు ఛైర్మన్, సభ్యుల నియామకం వివిధ దశల్లో ఉందని, త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని..
హెచ్‌ఆర్సీ, ఏపీఈఆర్సీ నియామక ప్రక్రియ జరుగుతోంది.. హైకోర్టుకు నివేదించిన ఏజీ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): లోకాయుక్తతోపాటు మానవ హక్కుల కమిషన్ (ఏపీహెచ్‌ఆర్సీ), ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)లకు ఛైర్మన్, సభ్యుల నియామకం వివిధ దశల్లో ఉందని, త్వరలోనే ప్రక్రియ పూర్తవుతుందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బుధవారం హైకోర్టుకు తెలిపారు. హెచ్‌ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం సీఎం నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించామని, ఈ నెల 14తో గడువుముగిసిందన్నారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్‌సీఆర్‌డీసీ) చైర్‌పర్సన్, సభ్యుల నియమకంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.