ప్రతి నియోజకవర్గానికో ఉత్తమ పాఠశాల
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:34 AM
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
జిల్లాకో జూనియర్ కళాశాల
స్కూల్ ఇన్‌ఫ్రా కమిషనర్ ఉత్తర్వులు
డీపీఆర్‌ల తయారీకి ఆదేశం
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్‌ఫ్రా కమిషనర్ పి.రంజిత్ బాషా బుధవారం అధికారులను ఆదేశించారు. సరైన రవాణా సదుపాయం, సమాచార అవకాశం, అందుబాటు లో అత్యవసర సేవలు, సరైన రోడ్లు ఉండాలి.. కనీ సం 5 ఎకరాల్లో పాఠశాల ఉండాలి. క్రీడా మైదా నం, పార్కింగ్ తప్పనిసరి.. 5 కిలోమీటర్ల పరిధిలో పీహెచ్‌సీ, టీచర్లకు 5 కిలోమీటర్ల పరిధిలో నివాస సముదాయాలు ఉండాలి. విద్యుత్, సమీపంలో పోలీసు స్టేషన్ ఉండడంతో పాటు శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలి. గ్రీన్ క్యాంపస్ ఉండాలి.. ఇలాంటి పాఠశాలలను గుర్తించి పూర్తిస్థాయిలో తరగతి గదులు నిర్మిస్తారు. లేబొరేటరీలు, లైబ్రరీలు, స్టాఫ్ రూమ్, డైనింగ్ హాల్, తాగునీటి వ్యవస్థ, టాయిలెట్లు, రికార్డు రూమ్, స్టోర్ రూమ్ సైన్స్ పార్క్, ఇండోర్ స్టేడియం, పార్కింగ్ సముదాయం, కిచెన్ గార్డెన్, వాకింగ్ ట్రాక్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. సుందరీకరణ పనులూ చేస్తారు. ఇందుకోసం 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను.. నియోజకవర్గానికి ఒకటి, వెయ్యి మంది దాటిన పాఠశాలలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించాలని ఆదేశించారు. జిల్లాకో జూనియర్ కాలేజీని కూడా గుర్తించాలన్నారు. 5 కేజీబీవీలు, 5 మోడల్ స్కూల్స్, 5 గురుకుల విద్యా సంస్థలను సైతం గుర్తించాలని స్పష్టంచేశారు. వీటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు తయారుచేయాలని ఇన్‌ఫ్రా కమిషనర్ ఆదేశించారు.