అనాథ పశువులకు ఆశ్రయం
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:40 AM
నిరాదరణకు గురైన, తప్పిపోయిన, తనిఖీల్లో పట్టుబడిన, వీధి పశువుల రక్షణ కోసం పశు వసతి గృహాలు (గోశాలలు) నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాకు ఐదు పశు వసతి గృహాలు.. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణం
స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): నిరాదరణకు గురైన, తప్పిపోయిన, తనిఖీల్లో పట్టుబడిన, వీధి పశువుల రక్షణ కోసం పశు వసతి గృహాలు (గోశాలలు) నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాకు ఐదు చొప్పున ఈ వసతి గృహాలు నిర్మించనున్నది. ఒక్కో వసతి గృహాన్ని రూ.10లక్షల వ్యయంతో నిర్మించాలని 2026-27 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసే వసతి గృహాల్లో 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. మిగతా స్థలంలో గడ్డి పెంపకం, తాగునీటి తొట్టెలు ఉంటాయి. ఇందుకు అవసరమైన స్థలాలను రెవిన్యూ శాఖ సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి సంస్థ వసతి గృహ నిర్మాణం చేపట్టనున్నది. ఇందులోని పశువులను స్థానిక పశువైద్య అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తారు. వాటి నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలు చేపట్టనున్నాయి. వీటి నిర్మాణాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.