కొత్తగా మరో 62 అన్న క్యాంటీన్లు
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:45 AM
కార్మికులు, కూలీలు, గ్రామీణులు, వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం...
15న ధరణికోటలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): కార్మికులు, కూలీలు, గ్రామీణులు, వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ అన్న క్యాంటీన్లను ఈ నెల 15న సీఎం చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో ప్రారంభిస్తారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసే 62 క్యాంటీన్లతో కలిసి మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.80 కోట్ల మంది పేదలు భోజనాలు చేశారు.