సొంతింటి సంబరం
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:44 AM
టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. టిడ్కో ఇళ్లతోపాటు రాష్ట్ర హౌసింగ్ శాఖ కట్టించినవాటినీ కలుపుకొని మొత్తం 2 లక్షలకుపైగా ఇళ్లకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దగ్గరుండి గృహ ప్రవేశా లు జరిపించారు.
టిడ్కో ఇళ్లకు గృహ ప్రవేశాలతో రాష్ట్రమంతా ఉత్సాహ వాతావరణం
కొత్త వస్త్రాలు, స్వీట్లు అందించి.. పేద లబ్ధిదారుల చేతికి తాళాలు
మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కార్యక్రమం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. టిడ్కో ఇళ్లతోపాటు రాష్ట్ర హౌసింగ్ శాఖ కట్టించినవాటినీ కలుపుకొని మొత్తం 2 లక్షలకుపైగా ఇళ్లకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దగ్గరుండి గృహ ప్రవేశా లు జరిపించారు. పేద లబ్ధిదారులకు కొత్త వస్ర్తాలు, స్వీట్లతో పాటు ఇంటి తాళాలను అందించారు. విశాఖలో 5 లేఅవుట్‌లలో రూ.318.03 కోట్ల వ్యయంతో నిర్మించిన 3,600 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. 2,928 ఇళ్లను గాజువాక అసెంబ్లీ పరిధిలోని దువ్వాడ, తలారివానిపాలెం, పెదగంట్యాడల్లో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 5,056 టిడ్కో ఇళ్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పేదలకు అందించారు. టిడ్కో ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.160 కోట్లు దారి మళ్లించిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో 17,440 ఇళ్లను పలువురు ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 335 కుటుంబాలు సొంతింటి కల నెరవేరింది. పల్నాడు జిల్లాలో పూర్తిచేసిన 1,980 గృహాలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. చిలకలూరిపేట మునిసిపాల్టీ పరిధిలో 4 టిడ్కో గృహాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గన్నెవారిపల్లి కాలనీలో 1,024 టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రారంభించారు.
విజయవాడ శివారులోని జక్కంపూడిలో నిర్మించిన 2,256 ఇళ్లను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమామహేశ్వరరావు అందించారు. కృష్ణాజిల్లా రుద్రవరంలో 1089 టిడ్కో గృహాలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు అప్పగించారు. కడపలోని లక్ష్మీనగర్‌లో 992 టిడ్కో ఇళ్లను మంత్రి సవిత, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస 151, నరసన్నపేట 55, పాతపట్నం 201, శ్రీకాకుళం 324, పలాస 163, ఇచ్ఛాపురం 151, ఎచ్చెర్ల 112 ఇళ్లను ఎమ్మెల్యే గొండు శంకర్, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 4,286 మందికి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటి తాళాలు అందజేశారు. నంద్యాల రైతునగర్‌లో గృహాలను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రారంభించారు. నిడదవోలు మండలం పందలపర్రులో మంత్రి దుర్గేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గృహప్రవేశాలు జరుగుతున్న చోటుకు జగన్ ఫొటోలు ఉన్న పత్రాలు పట్టుకొని కొందరు రావడం కలకలం రేపింది. వెంగళాయపాలెంలోని జగనన్న కాలనీలో వీరికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గత ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. అయితే ఆ స్థలాలు ప్రైవేటు వ్యక్తులవి కావడంతో వారు కోర్టులో కేసులు వేశారు. తమకు కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వారంతా గృహప్రవేశాలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు.