Share News

‘థర్మల్‌’కు 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:15 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో రాబోయే 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు.

‘థర్మల్‌’కు 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు

  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: సీఎస్‌

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో రాబోయే 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. ప్రపంచంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా బొగ్గు దిగుమతులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో విద్యుత్తు సంస్థల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ‘విద్యుత్తు ప్లాంట్లకు సజావుగా బొగ్గు రవాణా అయ్యేలా పోర్టులు, రైల్వేలతో సమన్వయం చేసుకోవాలి. రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగినంత బొగ్గు నిల్వలను నిర్వహించాలి. పీక్‌ డిమాండ్‌ సమయాల్లో గ్రిడ్‌ స్థిరత్వానికి తోడ్పడేందుకు అన్ని జనరేటింగ్‌ యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంటుకు అవసరమైన బొగ్గును అంచనా వేయాలి. రాబోయే వర్షాకాలంలో వర్షపాతం అంచనాలు ఆశాజనకంగా లేవు. ఇది థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తిపై ఎక్కువ ఒత్తిడి కలిగించే పరిణామం. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు. సమీక్షలో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, జెన్కో ఎండీ పి.పుల్లారెడ్డి, జెన్కో డైరెక్టర్లు సుజయ్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏకేవీ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 04:16 AM