Share News

కార్మికుల జీతాలకూ ప్రభుత్వ రాయితీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:11 AM

రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉద్యోగాల కల్పనే ప్రాతిపదికగా పారిశ్రామికవేత్తలకు భూముల ధరలు, విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాల..

కార్మికుల జీతాలకూ ప్రభుత్వ రాయితీ

  • వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం

  • 50 కోట్ల పెట్టుబడితో వెయ్యి ఉద్యోగాలిచ్చే వారికి వర్తింపు

  • పురుషుడికి 3 వేలు, మహిళకు 3500 ప్రభుత్వమే ఇస్తుంది

  • ఐదేళ్లపాటు వర్తించేలా ఏపీ టెక్స్‌టైల్‌ పాలసీకి సవరణ

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉద్యోగాల కల్పనే ప్రాతిపదికగా పారిశ్రామికవేత్తలకు భూముల ధరలు, విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండగా.. ఇకపై వారు నియమించుకునే కార్మికులకు ఇచ్చే వేతనాల్లోనూ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఓ పారిశ్రామిక వేత్త వెయ్యి మంది కార్మికులతో వస్త్ర పరిశ్రమను ప్రారంభిస్తే.. దానిలో పనిచేసే కార్మికుడికి యజమాని రూ.15 వేలు వేతనం ఇస్తే... అందులో రూ.500 ప్రభుత్వమే భరిస్తుంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే టెక్స్‌టైల్‌, అప్పరెల్‌, గార్మెంట్‌ పరిశ్రమలకు ఈ రాయితీ కల్పించాలని నిర్ణయించింది. కార్మిక ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సంస్థలకు వేతన సబ్సిడీ అందించేలా ఏపీ టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ అండ్‌ గార్మెంట్స్‌ పాలసీకి కూటమి ప్రభుత్వం కీలక సవరణ చేసింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారం.. ఇప్పటి వరకూ ఉపాధి ఆధారిత ప్రోత్సాహం.. ప్రధానంగా ఉద్యోగాలు, పెట్టుబడి నిష్పత్తిపై ఆధారపడి ఉండగా... వేతన సబ్సిడీని కూడా ఎంపిక చేసుకునే అవకాశం తాజాగా కల్పించింది. అయితే ఒక సంస్థ ఒకేసారి ఉపాధి సబ్సిడీ లేదా వేతన సబ్సిడీలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలి.


వేతన సబ్సిడీ పొందాలంటే కనీసం రూ.50కోట్ల ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌, కనీసం 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు ఇవ్వాలి. గార్మెంట్స్‌, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో ఏదైనా ఉండొచ్చు. ఉద్యోగుల సంఖ్య పెరిగేకొద్దీ సబ్సిడీ పెరుగుతుంది. కనిష్ఠంగా వెయ్యి మంది పనిచేసే సంస్థలో పురుషుడికి ప్రతి నెలా రూ.500, మహిళా ఉద్యోగికి రూ.1000 సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. 3వేల మంది ఉద్యోగులు ఉన్న సంస్థకు ఉత్పత్తి ప్రారంభించిన రోజు నుంచి పురుషుడికి రూ.3వేలు, మహిళకు రూ.3,500 రాయితీని ఐదేళ్లపాటు అందిస్తుంది. గార్మెంట్స్‌ వంటి అధిక శ్రమ ఆధారిత రంగాలకు ప్రత్యేక మద్దతు అవసరమని పరిశ్రమలు చేసిన వినతిపై ప్రభుత్వం పరిశీలించి..ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 10 , 2026 | 03:13 AM