Share News

అయినా... వీజీఎస్సే!

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:48 AM

ఇంటర్‌ పాఠ్యపుస్తకాల కంటెంట్‌ లీక్‌ ఆరోపణలతో వీజీఎస్‌ పబ్లిషర్స్‌కు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను తెలుగు అకాడమీ రద్దు చేసింది. అయితే అదే సంస్థకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల పెద్దఎత్తున పుస్తకాల ముద్రణ పని అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది.

అయినా... వీజీఎస్సే!

  • భారీగా ముద్రణ బాధ్యతలు అప్పగించిన పాఠశాల విద్యాశాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్‌ పాఠ్యపుస్తకాల కంటెంట్‌ లీక్‌ ఆరోపణలతో వీజీఎస్‌ పబ్లిషర్స్‌కు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను తెలుగు అకాడమీ రద్దు చేసింది. అయితే అదే సంస్థకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల పెద్దఎత్తున పుస్తకాల ముద్రణ పని అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌ పాఠ్యపుస్తకాల ముద్రణకు టెండర్లు పిలిచిన తెలుగు అకాడమీ... వీజీఎస్‌, విక్రమ్‌ సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన కొద్దిరోజులకే పాఠ్యపుస్తకాల పీడీఎఫ్‌ కాపీలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్పందించిన తెలుగు అకాడమీ ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. వీజీఎస్‌ సంస్థకు ఇచ్చిన వర్క్‌ ఆర్డర్‌ను రద్దుచేసింది. దీనిపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో వీజీఎ్‌సకు వర్క్‌ ఇచ్చేందుకు తెలుగు అకాడమీ అంగీకరించలేదు. కొత్త పాఠ్యపుస్తకాలు కావడంతో కంటెంట్‌ను ప్రైవేటు కాలేజీలకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కాలేజీలు అధిక ధరలకు విద్యార్థులకు పుస్తకాలు అమ్మేలా ప్లాన్‌ చేసినట్లు చిన్న ప్రింటర్లు ఆరోపిస్తున్నారు. పాఠ్యపుస్తకాల కంటెంట్‌తో స్టడీ మెటీరియల్‌ తయారు చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో గతంలోనూ వీజీఎ్‌సపై పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత కూడా 1, 2, 7, 10 తరగతుల విక్రయ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతను అదే కంపెనీకి కట్టబెట్టింది. గతేడాది కాంట్రాక్టు ప్రకారమే పని అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. టెండర్లు పిలిచి మరీ పని అప్పగించినా ఆరోపణలు రాగానే తెలుగు అకాడమీ స్పందించింది. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం తమకెలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటెంట్‌ లీకేజీ లాంటి తీవ్ర ఆరోపణలు వచ్చిన సంస్థకు వర్క్‌ ఆర్డర్లు ఇవ్వొద్దని కోరినా అధికారులు పట్టించుకోలేదని చిన్న ప్రింటర్లు ఆరోపిస్తున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 05:48 AM