విక్రయ పుస్తకాల ముద్రణను పునఃపరిశీలించండి
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:19 AM
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను ఇటీవల బయటకు లీక్ చేసిన నేపథ్యంలో పాఠశాల విద్య పరిధిలోని సేల్(విక్రయించే పుస్తకాల) ముద్రణను పునఃపరిశీలించాలని...
ప్రభుత్వ పుస్తకాల కంటెంట్ బయటకు వెళ్లకుండా చూడాలి
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను ఇటీవల బయటకు లీక్ చేసిన నేపథ్యంలో పాఠశాల విద్య పరిధిలోని సేల్(విక్రయించే పుస్తకాల) ముద్రణను పునఃపరిశీలించాలని ఏపీ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్ల సంఘం కోరింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సోమవారం లేఖ రాసింది. ఇంటర్ పాఠ్యపుస్తకాల కంటెం ట్ లీకేజీ అంశం ప్రభుత్వ ప్రచురణల విశ్వసనీయతను దెబ్బతీసిందని పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో పుస్తకాల వ్యాపారం చేసే పబ్లిషర్లకు పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యత ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తెలెత్తుతున్నాయని, ప్రభుత్వ కంటెంట్ ఆధారంగా ఆయా సంస్థలు గైడ్లు, క్వశ్చ న్ బ్యాంకులు, ఇతర స్టడీ మెటీరియల్ తయారు చేసుకుంటున్నారని పేర్కొంది. అందువల్ల పబ్లిషర్ల పాత్రను పరిశీలించాలని, ప్రభుత్వ పుస్తకా ల కంటెంట్ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
వీజీఎస్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల సాఫ్ట్ కాపీలను లీక్ చేసి వీజీఎస్ పబ్లిషర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంటెంట్ లీక్ చేసి న సంస్థపై కేవలం షోకాజు నోటీసులు, కేసులతో అధికారులు చేతులు దులుపుకొంటున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. మారిన కొత్త పాఠ్యపుస్తకాలను రూ.10కోట్లకు ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.