Share News

త్వరలో టెట్‌..!

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:25 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను త్వరలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో ....

త్వరలో టెట్‌..!

  • నిర్వహణ షెడ్యూల్‌పై నేడు నిర్ణయం

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను త్వరలో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో ఈసారి టెట్‌ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో దీని నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై పాఠశాల విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుంది. దీంతో కొత్తగా బీఈడీ, డీఈడీ చదివిన వారికోసం కూడా టెట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాసేందుకు సిద్ధమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టెట్‌ కోసం ఉపాధ్యాయుల ఎదురు చూపులు

సాధారణంగా టెట్‌ నోటిఫికేషన్‌ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తుంటారు. కానీ ఈసారి ఉపాధ్యాయులే దీనికోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే ఇందుకు కారణం. టెట్‌ అర్హత లేకుండా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారంతా రెండేళ్లలో టెట్‌ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నుంచీ దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా.. ఇటీవల దీనిపై ఓ రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. అర్హతకు మరో ఏడాది గడువు పెంచింది. కానీ.. మినహాయింపు మాత్రం ఇవ్వలేదు. కాగా, ఏటా 2సార్లు టెట్‌ నిర్వహించాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో 2011కు ముందు టీచర్‌ ఉద్యోగాలు పొందిన వారికి టెట్‌ లేదు. అలాంటి వారు దాదాపు లక్ష మంది ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో గతేడాది డిసెంబరులో టెట్‌ నిర్వహించారు. ఇందులో తొలిసారి ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసే అవకాశం కల్పించగా.. 15,239 మంది అర్హత సాధించారు. టెట్‌ నుంచి మినహాయింపు లభిస్తుందనే ఆశతో చాలామంది టీచర్లు టెట్‌ రాయలేదు. కానీ ఇప్పుడు రివ్యూ పిటిషన్‌లోనూ మినహాయింపు దక్కకపోవడంతో ఈసారి ఎక్కువ మంది టీచర్లు టెట్‌ రాసే అవకాశం ఉంది.

Updated Date - Jun 04 , 2026 | 04:25 AM