పన్ను ఆదాయంలో 19.47 శాతం వృద్ధి
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:16 AM
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూలై 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పన్ను రూపేణా రూ. 41,568.05 కోట్లు వసూలైందని ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని తెలిపారు.
ఉద్యోగులు తప్పుడు క్లెయిమ్‌లు చేస్తే ఇబ్బందులు
ఏపీ, తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూలై 17వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పన్ను రూపేణా రూ. 41,568.05 కోట్లు వసూలైందని ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని తెలిపారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 46,552.15 కోట్లు పన్ను వసూలు కాగా అందులో రూ.4,984.09 కోట్లు రిఫండ్ ఇచ్చామన్నారు. గతేడాది ఈ సమయంతో పోల్చుకుంటే ఈ వసూళ్లు 19.47 శాతం అధికమన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) రెండు రాష్ట్రాల్లోను రూ. 1,45,971.52 కోట్లు వసూలైందని, అందులో రూ. 22,234.47 కోట్లు రిఫండ్ ఇచ్చామని అన్నారు. ఏపీ వరకు చూస్తే గత ఏడాది రూ. 32,772.93 కోట్లు పన్నులు వసూలు కాగా అందులో రూ. 10,230.61 కోట్లు రిఫండ్ ఇచ్చామన్నారు. కొందరు ఉద్యోగులు ట్యాక్స్ కన్సల్టెంట్ల తప్పుడు సలహాలతో ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారని, ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. ఇక ఆదాయ పన్ను ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా విశాఖలో అధికారులకు క్వార్టర్లు నిర్మిస్తున్నామని, విశాఖపట్నం సాగర్‌నగర్‌లో నిర్మించిన 13 క్వార్టర్లను ఇప్పటికే కేటాయించామని తెలిపారు.